Health Insurance : జీవన శైలి వ్యాధులు విపరీతంగా పెరిగిపోతున్న నేటి కాలంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియోను క్రియేట్ చేసుకోవాలి. ముఖ్యంగా వీటిలో క్యాన్సర్, గుండె, కిడ్నీ సంబంధిత తీవ్ర వ్యాధుల చికిత్స కోసం క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు ఉండేలా చూసుకోవాలి.
ప్రస్తుతం మార్కెట్లో అనేక క్రిటికల్ ఇల్నెస్ పాలసీలు, రైడర్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీకు ఏది బెటర్‌గా ఉంటుందో మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు ప్రధానంగా టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలతో పాటు తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి స్టాండ్ అలోన్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను ప్రత్యేకంగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తీవ్రమైన వ్యాధుల చికిత్స కోసం క్రిటికల్ ఇల్నెస్ పాలసీలతో పాటు, ప్రత్యేకంగా ఒక్కో వ్యాధికి సంబంధించిన కవర్స్ కూడా ఉంటాయి.
ఏది బెటర్?
critical illness rider vs critical illness insurance : ఆరోగ్య బీమా తీసుకుందామని ఆలోచిస్తున్నవారికి వచ్చే మొదటి ప్రశ్న.. ఎలాంటి హెల్త్ పాలసీని తీసుకోవాలి? అని. క్లిష్టమైన వ్యాధుల కోసం ప్రత్యేకంగా పాలసీలు కొనుగోలు చేయాలా? లేదా యాడ్-ఆన్ ప్రయోజనంతో కూడిన ఏకైక సంపూర్ణ బీమా కవరేజీ తీసుకోవాలా?
మీరు తీవ్రంగా జబ్బుపడి లేదా గాయాలపాలై ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్స పొందడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. ఓ వ్యక్తి మరణించిన తరువాత అతడి కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇస్తుంది జీవిత బీమా.
కానీ మీరు దీర్ఘకాలంపాటు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వస్తే మాత్రం.. మీ సాధారణ ఆరోగ్య బీమా కానీ, జీవిత బీమాగానీ మీకు పెద్దగా ఉపయోగపడవు. పైగా చికిత్స ఖర్చుల కోసం సొంత సొమ్ము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది కనుక మీ ఇంటి ఆర్థిక స్థితిగతులు కూడా బాగా దెబ్బతింటాయి.
క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్స్ - బెనిఫిట్స్
Critical Illness Cover Benefits : క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ తీసుకుంటే మీకు చికిత్స అవసరమైన సమయంలో నిర్దేశిత పరిహారం మొత్తం వస్తుంది. వాస్తవానికి ఆసుపత్రి బిల్లు ఎంత అయ్యింది అనేదానితో సంబంధం లేకుండా నిర్దేశిత మొత్తం సొమ్మును బీమా కంపెనీవాళ్లు మీకు ఇచ్చేస్తారు.
ఈ సొమ్మును మీరు కేవలం ఆసుపత్రి ఖర్చులకు మాత్రమే ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీర్ఘకాలిక సైకోథెరపీకి, అవసరమైన పరికరాల కొనుగోలు చేసేందుకు, మీ జీవన శైలి మార్పుల కోసం, ఆదాయ నష్టాన్ని పూరించడం కోసం కూడా వాడుకోవచ్చు.
క్రిటికల్ ఇల్నెస్ పాలసీల్లో.. కాన్సర్స్, హార్ట్ ఎటాక్స్ లాంటి గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధుల చికిత్సలతోపాటు.. కంటి చికిత్స, అవయవ మార్పిడి చికిత్సల కోసం కూడా బీమా సౌకర్యం కల్పిస్తారు. అయితే బీమా కంపెనీ, ఎంచుకున్న ప్లాన్ల ప్రకారం కవర్ అయ్యే అనారోగ్యాల జాబితా మారుతూ ఉంటుంది. బీమా ప్రీమియం ధరలను అనుసరించి కూడా కవరేజీ మారుతుంది.
సాధారణంగా సర్వైవల్ పీరియడ్ గడిచిన తరువాత, వ్యాధి నిర్ధరణ జరిగిన 30 రోజుల్లోపు బీమా సొమ్ము మొత్తం ఒకేసారి చెల్లిస్తారు. కొన్నిసార్లు చిన్నచిన్న వ్యాధుల చికిత్స కోసం బీమా సొమ్మువాడాల్సి వస్తే 25 శాతం వరకు వాడుకోవచ్చు. ఇతర వ్యాధుల చికిత్స కోసం.. మిగతా బీమా కవరేజీని కంటిన్యూ చేసుకోవచ్చు.
పరిమితులు కూడా ఉంటాయ్!
యాంజియోప్లాస్టీ లాంటి కొన్ని నిర్దిష్ట చికిత్సల కోసం కేవలం 50 శాతం కవరేజీని మాత్రమే బీమా సంస్థలు కల్పిస్తాయి. ఈ విషయం కూడా పాలసీదార్లు గుర్తుంచుకోవాలి.
సాధారణంగా ఇలాంటి క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను తీసుకునేటప్పుడు అన్ని మేజర్ వ్యాధులు కవర్ అయ్యేలా చూసుకోవాలి. ఉదాహరణకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలంటే కనీసం 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్ఛు అవుతుంది. కనుక ఇలాంటి తీవ్ర వ్యాధుల చికిత్సలను ఈ పాలసీలు కవర్ చేస్తాయో లేదో చూసుకోవాలి. అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ నుంచి సెకెండ్ ఒపీనియన్ తీసుకునేందుకు కూడా అవకాశం కల్పించేలా చూసుకోవాలి. కనీసంగా రూ.50 లక్షల వరకు కవరేజ్ ఉండేలా క్రిటికల్ ఇల్నెస్ పాలసీని తీసుకోవాలి.
క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు తీసుకోవచ్చా?
జీవితబీమా సంస్థలు లైఫ్ ఇన్సూరెన్స్‌తో పాటు క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు కూడా అందిస్తూ ఉంటాయి. కొన్ని కంపెనీలు రైడర్లను రెన్యూవల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తాయి.
క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ - బెనిఫిట్స్
Critical Illness Rider Benefits : వాస్తవానికి క్రిటికల్ ఇల్నెస్ రైడర్లు కాస్త తక్కువ ధరకే లభిస్తాయి. దానికి తగ్గట్లే బెనిఫిట్స్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. కానీ ఇవి పాలసీదారుడు తీవ్రంగా గాయపడినప్పుడు.. మరణించినప్పుడు అతడి కుటుంబం ఆర్థికంగా నష్టపోకుండా కాపాడతాయి.
రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) నిబంధనల ప్రకారం, క్రిటికల్ ఇల్నెస్ ప్రీమియం అనేది బేసిక్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం కంటే ఎక్కువగా ఉండకూడదు. దీనికి తగ్గట్టుగానే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా.. జీవితబీమా బేసిక్ కవరేజ్ కంటే క్రిటికల్ ఇల్నెస్ చికిత్సకు అయ్యే ఖర్చులను తక్కువగా ఇస్తాయి. అందువల్ల మీరు జీవితబీమా తీసుకున్నప్పుడు, కనీసం 25 నుంచి 30 లక్షల వరుకు క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ ఇచ్చే రైడర్లు ఎంచుకోవడం మంచిది. ఒక వేళ అది కుదరకపోతే.. ప్రత్యేకంగా క్రిటికల్ ఇల్నెస్ పాలసీని తీసుకోవడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జీవిత బీమా టెర్మ్ ఉన్నంత వరకు మాత్రమే, దాని అనుబంధ రైడర్లు పనిచేస్తాయి. ఒకసారి లైఫ్ ఇన్సూరెన్స్ టెర్మ్ పూర్తి అయితే ఇక రైడర్లు కూడా ముగిసిపోతాయి. కానీ ప్రత్యేకంగా తీసుకున్న స్టాండ్అలోన్ క్రిటికల్ ఇల్నెస్ పాలసీలను మాత్రం మనం రెన్యూవల్ చేసుకోవచ్చు. కానీ వయస్సును అనుసరించి ప్రీమియంలు పెరుగుతూ ఉంటాయి. దీనిని అనుసరించి ఇప్పుడు మీరు మీకు అనువైన పాలసీని లేదా రైడర్లను ఎంచుకోండి.