ఆదాయపు పన్నుల విధానాన్ని సరళీకృతం చేసే దిశగా గత కొన్నేళ్లుగా ఎన్నో మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆదాయపు పన్ను శ్లాబులను సవరించడం, మినహాయింపుల పరిమితిని పెంచడం, కొత్త సెక్షన్లను తీసుకురావడంలాంటివి గతంలో ఉండేవి. 2020-21 బడ్జెట్‌లో ప్రతిపాదించిన కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులతో పనిలేకుండా వచ్చిన ఆదాయానికి వర్తించే శ్లాబుల ప్రకారం నేరుగా పన్ను చెల్లించే వీలును తీసుకొచ్చారు. పాత పన్ను విధానం-కొత్త పన్ను విధానంలో కావాల్సింది ఎంచుకునే వీలుంది. కానీ, చాలామందికి సెక్షన్ 80సీలో రూ.1,50,000, ఇంటి రుణం వడ్డీ రూ.2,00,000, సెక్షన్ 80డీ కింద రూ.25,000, విద్యా రుణం వడ్డీ చెల్లింపు, ఎన్‌పీఎస్‌లాంటివి ఉండటంతో కొత్త పన్ను విధానంతో పోలిస్తే మినహాయింపులను క్లెయిం చేసుకునేందుకు వీలున్న పాత పన్ను విధానం వైపే మొగ్గు చూపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రిటర్నులు దాఖలు చేసిన వారిలో 1 శాతంలోపే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నారు. కొత్తగా పన్ను పరిధిలోకి వచ్చే వారు, పెట్టుబడులు పెట్టలేని వారు దీన్నే ఎంచుకునేలా ప్రభుత్వం తాజా ప్రతిపాదనలు చేసింది. పైగా దీన్ని 'డిఫాల్ట్'గా మార్చింది. అయినా ఇష్టమైనది ఎంచుకునే వీలుంది.
నెలకు రూ.62,500 వచ్చినా..
ప్రతిపాదిత కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 115బీఏసీ ప్రకారం రూ.7లక్షల వరకూ ఎలాంటి పన్నూ వర్తించదు. రూ.50వేల ప్రామాణిక తగ్గింపునూ దీనికి వర్తింపచేశారు. దీంతో మొత్తం ఆదాయం రూ.7,50,000 వరకూ ఉన్నవారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే నెలకు రూ.62,500 వరకూ వేతనం ఆర్జించే వారందరూ పన్ను నుంచి మినహాయింపు పొందినట్లే. పదేళ్ల క్రితం ఈ ఆదాయానికి రూ.82,400 పన్ను చెల్లించాల్సి వచ్చేది. కొత్త పన్ను విధానంలో శ్లాబుల సంఖ్యనూ తగ్గించడం ఇక్కడ గమనార్హం. రూ.15లక్షల ఆదాయం మించిన వారికి 30 శాతం పన్ను శ్లాబును కొనసాగించారు.
మారాల్సిందేనా?
పన్ను చెల్లింపుదారులు తక్కువ నిబంధనలు, తక్కువ పన్ను ఉండే విధానానికే ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. మినహాయింపులు అధికంగా ఉన్న వారు పాత పన్ను విధానాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. తక్కువ మినహాయింపులు ఉన్నవారికి అధిక ప్రయోజనాలు కల్పించే విధంగా కొత్త పన్ను విధానం ఉంది. కొత్త, పాత పన్ను విధానాన్ని పోల్చి చూసి, తక్కువ పన్ను భారం పడే విధానాన్ని ఎంచుకోవచ్చు. కొంతమందికి పాత పద్ధతే ప్రయోజనం చేకూర్చవచ్చు. ఇది పూర్తిగా వారికి ఉన్న పలు పన్ను ఆదా పెట్టుబడులు, గృహ, విద్యా రుణం వడ్డీ చెల్లింపులపై ఆధారపడి ఉంటుంది.