స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల బీమా అవసరాలను తీర్చడానికి రూపొందించారు. విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు ప్రయాణ సమయంలో భారతదేశంలో ప్రయాణ బీమాను కొనుగోలు చేయొచ్చు. ఈ బీమా.. మెడికల్, నాన్-మెడికల్, అనేక అత్యవసర పరిస్థితుల్లో జరిగే నష్టాలను కవర్ చేస్తుంది. బీమా, వైద్యేతర మెడికల్ ఎమర్జెన్సీలతో పాటు పాలసీ పొడిగింపు, పునరుద్ధరణ ఫీచర్లతో లభిస్తుంది. ఇది విద్యార్థులు విదేశాలలో ఉన్నంతకాలం యాక్టివ్‌గా ఉంటుంది. ఊహించని సంఘటనల వల్ల కలిగే ఆర్థిక నష్టాలను తొలగించడానికి ప్రయాణ బీమా పాలసీని కొనుగోలు చేయడం చాలా ప్రయోజనకరం.
ట్రావెల్ ఇన్సూరెన్స్ వల్ల ప్రయోజనాలు
ఏదైనా అత్యవసర ఆస్పత్రి ఖర్చులను, ఊహించని అనారోగ్యాలు, శారీరక గాయాలు కలిగినప్పుడు వైద్య బిల్లులు, చికిత్స ఖర్చులను కవర్ చేస్తుంది. ప్రయాణ సమయంలో లగేజీ పోయినట్లయితే జరిగిన నష్టాన్ని కవర్ చేస్తుంది. ప్రయాణాల్లో జాప్యం వంటి ఇబ్బందులు తలెత్తినప్పుడు జరిగే నష్టాన్ని కవర్ చేస్తుంది.
స్పాన్సర్ కవర్
విద్యార్థికి ఉండే స్పాన్సర్ మరణించిన సందర్భంలో చదువుకు ఏదైనా అంతరాయం ఏర్పడితే బ్యాలెన్స్ కోర్సు ఫీజును కవర్ చేస్తుంది.
పాస్‌పోర్ట్
ఒక విద్యార్థి తన పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకున్నట్లయితే తాత్కాలిక పాస్‌పోర్ట్‌ను అందిస్తుంది.
ఏ వయసువారికి పాలసీ?:
- విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 16-35 సంవత్సరాల మధ్య వయసు గల భారతీయ విద్యార్థులు ప్రయాణ బీమాకు అర్హులు.
- ప్రయాణ బీమా వ్యవధి 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది.
పాలసీ కవరేజీ ఎంత?
విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలు వారి విద్యార్థులకు నిర్దిష్ట బీమా అవసరాలను కలిగి ఉంటాయి. వాటిని విశ్వవిద్యాలయ వెబ్‌సైట్లలో స్పష్టంగా పేర్కొంటారు. కొన్ని విద్యాలయాలు అడ్మిషన్ ప్రక్రియలో కనీస అవసరాలను సూచిస్తాయి. అమెరికా, కెనడాకు కనీసం రూ.1.50 కోట్లు, యూకే, ఇతర దేశాలకు రూ.37 లక్షల నుంచి రూ.1.50 కోట్ల వరకు విద్యార్థులకు ప్రయాణ కవరేజీని కలిగి ఉంటాయి. స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ కలిగి ఉంటే ప్రపంచవ్యాప్తంగా కవరేజీ ఉన్నట్టే. అయితే ఇది ఒక దేశం నుంచి మరో దేశానికి భిన్నంగా ఉంటుంది. సేవల లభ్యత, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల ప్రకారం మారుతూ ఉంటాయి.