Hidden Charges On Credit Card : అవసరానికి డబ్బుల్లేనప్పుడు.. అత్యవసరంగా నగదు అవసరమైనప్పుడు.. వేగంగా మనకు కావల్సిన సొమ్మును అందించే సాధనం క్రెడిట్ కార్డు. చాలా సందర్భాల్లో క్రెడిట్ వాడకం ఎంతో మంచి చేస్తుంది. కానీ అనేక సంస్థలు హిడెన్ ఛార్జీలను విధిస్తాయి. అందుకోసమే ఒక కార్డును తీసుకునేటప్పుడు వాటి పూర్తి వివరాలు, ఛార్జీలు తెలుసుకోవాలి. ఇలా చేస్తే హిడెన్ ఛార్జీలను నివారించవచ్చు. వివిధ సంస్థలు ప్రధానంగా విధించే ఛార్జీల గురించి ఇప్పుడు చూద్దాం.
1.మెయింటెనెన్స్ ఛార్జీ
మనం క్రెడిట్ కార్డును వినియోగించేటప్పుడు అనేక ఛార్జీలను వసూలు చేస్తాయి సంస్థలు. కాకపోతే వీటి వల్ల మనం ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. "చాలా కంపెనీలు.. వార్షిక రుసుములను వసూలు చేసి, దీనికి బదులుగా కొన్ని ప్రయోజనాలను అందిస్తుంటాయి. వీటిలో చాలా వరకూ మనం ఎప్పుడూ వినియోగించుకునేవే ఉంటాయి. హోటల్‌లో బస చేసినప్పుడు రాయితీ, గోల్ఫ్ కోర్సులు, విమానాశ్రయాల్లో లాంజ్ ప్రవేశంలాంటివి ఇందులో ఉంటాయి" అని SAG ఇన్ఫోటెక్ ఎండీ అమిత్ గుప్తా తెలిపారు.
మొదటిసారి క్రెడిట్ కార్డు తీసుకున్నప్పుడు జాయినింగ్ ఛార్జీ కడితే.. ఆ ఏడాది వార్షిక రుసుం చెల్లించాల్సిన అవసరం ఉండదన్నారు 'మై ఫండ్ బజార్' సీఈఓ వినీత్. కాకపోతే క్రెడిట్ కార్డు తీసుకునే ముందు.. ఆ కార్డు ఏడాది ఉచితమా..? జీవిత కాలం ఉచితమా..? అన్న విషయాలను ధ్రువీకరించుకుని తీసుకోవాలని సూచించారు.
2. క్యాష్ అడ్వాన్స్ ఛార్జీ
మనం ATMల నుంచి నగదు విత్డ్రా చేసేందుకు క్రెడిట్ కార్డును ఉపయోగిస్తాం. అయితే క్రెడిట్ కార్డు తీసుకునే సమయంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సంస్థలు మనకు ఛార్జీలు విధిస్తాయి. క్యాష్ విత్డ్రా చేసుకున్న సమయం నుంచి వడ్డీని వసూలు చేస్తారు. ఇది విత్డ్రా చేసిన మొత్తంలో 2.5 శాతం వరకు ఉంటుంది.