Sova Malware Banking Apps : పండగల వేళ డిజిటల్ లావాదేవీలు అధికంగా జరుగుతున్నాయి. ఇ-కామర్స్ సంస్థల్లో కొనుగోళ్లు, దుకాణాల్లో చెల్లింపులు అన్నీ డిజిటల్లోనే జరుగుతున్నాయి. ఇదే అదనుగా మోసగాళ్లు బ్యాంకింగ్ యాప్‌లే లక్ష్యంగా కొత్త వైరస్‌లను సృష్టించి, మొబైల్ ఫోన్లకు సందేశాలు పంపిస్తున్నారు. ఈ వైరస్ల లింకులను ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు.. ఫోన్లో ఉన్న బ్యాంకింగ్ యాప్‌ల సమాచారం నేరగాళ్లకు చేరిపోతోంది. ఇప్పుడు తాజాగా మరో కొత్త వైరస్ వచ్చింది. 'సోవా' పేరుతో ఒక వైరస్ మొబైల్ ఫోన్లలోకి జొరబడుతోందని, అప్రమత్తంగా ఉండాలని బ్యాంకులు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
అరచేతిలోనే బ్యాంకింగ్ లావాదేవీలన్నీ క్షణాల్లో నిర్వహించుకునే వీలు యాప్‌ల ద్వారా వీలవుతుంది. ఇప్పుడు ప్రతి బ్యాంకూ తమ ఖాతాదారుల ప్రయోజనం కోసం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. అవగాహనతో వీటిని వాడితే ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ, మోసగాళ్లు ఈ బ్యాంకింగ్ యాప్‌లను పోలినట్లుగానే మరో నకిలీ యాప్‌లను సృష్టిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా బ్యాంకింగ్ యాప్‌ల నుంచి సమాచారాన్ని తస్కరించేందుకు 'సోవా' మొబైల్ బ్యాంకింగ్ మాల్వేర్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం పంపిస్తున్నారు. అందులో ఉన్న పొరపాటున క్లిక్ చేస్తే చాలు. ఈ ఆండ్రాయిడ్ ట్రోజన్ ఫోన్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (సీఈఆర్టీ) సోవా వైరస్ విషయంలో బ్యాంకులకు సమాచారం ఇవ్వడంతో పాటు, తీసుకోవాల్సిన జాగ్రత్తలనూ సూచించింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌లతో పాటు పలు బ్యాంకులు ఈ విషయంపై ఖాతాదారులను అప్రమత్తం చేస్తూ సంక్షిప్త సందేశాలను పంపిస్తున్నాయి.
ఏమిటిది?
'సోవా ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ ట్రోజన్ మాల్వేర్. ఇది ఫోన్లలో చేరి, అందులో ఉన్న వ్యక్తిగత సమాచారంతోపాటు, నెట్- బ్యాంకింగ్ యాప్‌లను వాడినపుడు పాస్‌వర్డ్‌లను తస్కరిస్తుంది. ఒక్కసారి ఇది ఫోన్లో చేరితే..దీన్ని తొలగించడం దాదాపు అసాధ్యం' అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్విటర్ ఖాతాలో తెలిపింది. ఈ వైరస్ ఎక్కువగా సంక్షిప్త సందేశాల రూపంలోనే వస్తోంది. ఒక్కసారి ఫోన్లో చేరాక.. అందులో ఉన్న యాప్‌ల గురించి కమాండ్ అండ్ కంట్రోల్ సర్వర్‌కు సమాచారాన్ని చేరవేస్తుంది. ఆ తర్వాత అందులో ఉన్న బ్యాంకింగ్ యాప్‌లను లక్ష్యంగా చేసుకొని, మాల్వేర్ను పంపించి, వాటిని తమ నియంత్రణలోకి తీసుకుంటారు.
టోకన్లనూ పసిగట్టేలా..