Bank Strike News :దేశంలోని వివిధ బ్యాంకుల ఉద్యోగులు.. సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించారు. 2023 డిసెంబర్ 4 నుంచి 2024 జనవరి 20 వరకు విడతలవారీగా సమ్మెకు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్ ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారని ఆల్ ఇండియా బ్యాంకింగ్ యూనియన్ అసోసియేషన్ ప్రకటించింది. దేశ, రాష్ట్ర, ప్రాంతాల వారీగా ఆందోళనలు జరగనున్నట్లు పేర్కొంది. దీంతో ఉద్యోగులు సమ్మెకు వెళుతున్న ఆయా రోజుల్లో బ్యాంకింగ్ సేవలు నిలిచిపోనున్నాయి.
భారత్‌లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్‌ల ఉద్యోగులు.. 2024 జనవరి 19,20 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెకు వెళతారని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రకటించింది. అంతకు ముందు పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింద్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తదితర బ్యాంక్ ఉద్యోగులు.. 2023 డిసెంబర్ 4 నుంచి 8 వరకు సమ్మెకు దిగాలని నిర్ణయించారు. డిసెంబర్ 11న ప్రైవేటు బ్యాంక్‌ల ఉద్యోగులు సమ్మె చేయనున్నారు.
అనంతరం 2024 జనవరి 2 నుంచి 6వ తేదీ వరకు కూడా ప్రాంతాలవారీగా సమ్మె చేయాలని ఆల్ ఇండియా బ్యాంకింగ్ యూనియన్ అసోసియేషన్ నిర్ణయించింది.
ఎందుకీ సమ్మె నిర్ణయం?
ఈ మధ్య కాలంలో బ్యాంకుల్లో ఖాతాదారుల సంఖ్య భారీగా పెరిగిందని.. దీంతో ఉద్యోగులపై పనిభారం కూడా ఎక్కువైందని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి తోడు ఉద్యోగుల కొరత సైతం భారీగానే ఉందని చెబుతున్నాయి. ఫలితంగా ఉద్యోగులు పని భారాన్ని తట్టుకోలేకపోతున్నారని సంఘాలు వివరించాయి. వీలైనంత త్వరగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.