బ్యాంకు రుణాల్లో ఆకర్షణీయమైన వృద్ధి కనిపిస్తోంది. ఒక పక్క అధిక ద్రవ్యోల్బణం, రూపాయి మారకం విలువలో క్షీణత, ఆర్థిక వ్యవస్థకు లోటు భారం పెరుగుతుందనే ఆందోళన వంటి సవాళ్లు ఉన్నప్పటికీ రుణాల్లో వృద్ధి చోటు చేసుకోవటం ఆసక్తికరమైన పరిణామంగా ఉంది. గత నెల 15 నాటికి మనదేశంలో బ్యాంకులు జారీ చేసిన రుణాల మొత్తం రూ.122.8 లక్షల కోట్లకు పెరిగింది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 14 శాతం అధికం.
చిన్న రుణాల జారీ అధికంగా ఉన్నట్లు, అంతేగాక వ్యాపార సంస్థలు తమ నిర్వహణ అవసరాల కోసం (వర్కింగ్ కేపిటల్) ఎక్కువగా అప్పులు చేస్తున్నట్లు వెల్లడైంది. మరోపక్క స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై అధిక ప్రతిఫలం కనిపిస్తుందనే ఆలోచనతో ఎంతో మంది మదుపరులు బ్యాంకుల్లో అప్పులు తీసుకొని షేర్లలో మదుపు చేస్తున్నారు. దీనివల్ల బ్యాంకులు ఇచ్చిన రుణాల్లో వృద్ధి కనిపిస్తున్నట్లు కేర్ రేటింగ్స్ తాజాగా ఒక నివేదికలో విశ్లేషించింది. మరికొన్ని ప్రత్యేకాంశాలనూ ఈ సందర్భంగా ఉదహరించింది.
- గత రెండు- మూడేళ్ల గణాంకాలను విశ్లేషిస్తే..రుణాల కంటే డిపాజిట్లలో అధిక వృద్ధి ఉన్నట్లు అర్థమవుతోంది. కానీ ఇప్పుడు మాత్రం దీనికి భిన్నంగా డిపాజిట్ల కంటే రుణాల్లో అధిక వృద్ధి కనిపిస్తోంది.
- రిటైల్ రుణాల విభాగంలో 18.1 శాతం వార్షిక వృద్ధి ఉంది. చిన్న రుణాలు, క్రెడిట్ కార్డుల నుంచి వసూళ్లు, గృహ- వాహన రుణాలు, గృహోపకరణాల కొనుగోలుకు తీసుకునే అప్పులు అధికంగా నమోదవుతున్నాయి.
- ఇటీవల కాలంలో బ్యాంకులు ఎంసీఎఆర్ రేట్లు, డిపాజిట్ రేట్లను పెంచిన విషయం విదితమే. అయినప్పటికీ రుణాల్లో వృద్ధి కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
- వృద్ధి రేటు పెరుగుతుందనే అంచనాలు, అందుకు అనుగుణంగా ప్రభుత్వ - ప్రైవేటు రంగ సంస్థలు మూలధన వ్యయాన్ని పెంచే దిశగా ముందుకు సాగటం, పీఎల్‌ఐ పథకం అమలు, కేంద్ర ప్రభుత్వం ఈసీఎల్‌జీఎస్ (ఎమెర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్) పథకాన్ని పొడిగించడం వంటి పరిణామాలతో ఎంఎస్‌ఎంఈ, రిటైల్ విభాగాల నుంచి రుణాలకు గిరాకీ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు రుణాల్లో వృద్ధి 12- 13 శాతం మేరకు ఉంటుందని కేర్ రేటింగ్స్ అంచనా వేసింది.
- కాకపోతే అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపుతో ఈ అంచనాలు మారిపోవచ్చు.