FDలపై భారీగా పెరిగిన వడ్డీ రేట్లు.. ఏ బ్యాంకు ఎక్కువ ఇస్తోందంటే? - బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు
ఎప్పుడు లేని విధంగా దేశంలోని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచుతున్నాయి. గరిష్ఠంగా 8-8.50 శాతం వడ్డీని చెల్లిస్తున్నాయి. చాలా ఏళ్ల తరువాత బ్యాంక్లు ఈ స్థాయిలో వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. భారీగా డిపాజిట్లను సేకరించేందుకు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు పెంచిన ఈ తాజా వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం.
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ.. ఆ ప్రభావాన్ని అధిగమించేందుకు బ్యాంకులు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే కస్టమర్ల నుంచి భారీ స్థాయిలో డిపాజిట్లను సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కస్టమర్ల నుంచి అంతగా స్పందన రావడం లేదు. దానికి కారణం బ్యాంకులు డిపాజిట్లపై తక్కువ వడ్డీలు చెల్లించడమే. ఇది గమనించిన బ్యాంకులు డిపాజిట్లపై వడ్డీల రేట్లను పెంచాయి. చాలా ఏళ్ల తరువాత ఈ వడ్డీ రేట్లు 8 శాతం దాటాయి. రాష్ట్ర అధ్వర్యంలో నడుస్తున్న పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మిగతా బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తోంది. దేశంలో ఉన్న ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.
- దేశంలోనే అతిపెద్ద బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. దేశవ్యాప్తంగా 20వేల బ్రాంచీలు కలిగిన ఈ బ్యాంక్.. సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.60 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 400 రోజుల వ్యవధి ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ వడ్డీని అందిస్తోంది.
- అన్ని బ్యాంకుల కంటే ఎక్కువగా పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కవ వడ్డీని అందిస్తోంది. ఈ బ్యాంకు.. సాధారణ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8 శాతం వడ్డీని చెల్లిస్తోంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 8.50 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు 221 రోజుల వ్యవధి ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లకు వర్తిస్తాయి.
- పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తరువాత ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తోంది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ బ్యాంక్.. 7.35 నుంచి 7.85 శాతం వరకు వడ్డీని అందిస్తోంది. 444 రోజుల వ్యవధి ఉండే రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.35 శాతం వడ్డీని.. సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.85 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 800 రోజుల వ్యవధి ఉండే రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.30 వడ్డీని.. సీనియర్ సిటిజన్ డిపాజిట్లపై 7.80 శాతం వడ్డీని అందిస్తోంది.
- పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఓ మాదిరిగానే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీని చెల్లిస్తోంది. 666 రోజుల వ్యవధితో కూడిన రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. అదే విధంగా సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
- బ్యాంక్ ఆఫ్ బరోడా సైతం కొత్త వడ్డీ రేట్లతో ముందుకొచ్చింది. 399 రోజుల వ్యవధితో కూడిన రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.05 శాతం వడ్డీని.. సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.75 శాతం అందిస్తోంది.
- బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ తరహాలోనే వడ్డీ చెల్లిస్తోంది. 444 రోజుల వ్యవధితో కూడిన రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.05 శాతం వడ్డీని.. సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.75 శాతం వడ్డీని అందిస్తోంది.
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీ.. సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ అందిస్తోంది. 200 రోజుల వ్యవధితో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ వడ్డీని చెల్లిస్తోంది.
- 400 రోజుల వ్యవధితో కూడిన రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై.. కెనరా బ్యాంక్ 7.15 శాతం వడ్డీని చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై.. 7.65 శాతం వడ్డీని అందిస్తోంది.
- 555 రోజుల వ్యవధితో కూడిన రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై.. ఇండియన్ బ్యాంక్ 7 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని అందిస్తోంది.
- యూకో బ్యాంక్.. 666 రోజుల వ్యవధితో కూడిన రిటైల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై.. 7.15 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది.
- ఎచ్డీఎఫ్సీ బ్యాంక్ జనరల్ పబ్లిక్ నుంచి స్వీకరించే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కేవలం 7 శాతం మాత్రమే వడ్డీ చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీని అందిస్తోంది. ఐదు సంవత్సరాల వ్యవధితో కూడిన డిపాజిట్లపై ఈ వడ్డీని చెల్లిస్తోంది.
- ఐసీఐసీఐ బ్యాంక్.. 15 నెలల వ్యవధితో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7 శాతం వడ్డీని, సీనియర్ సిటిజన్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీని అందిస్తోంది.