మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఓ ట్రిప్లెక్స్ హౌస్.. ఏకంగా రూ.252 కోట్లకు అమ్ముడుపోయింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ ఆటో ఛైర్మన్, బజాజ్ గ్రూప్ ప్రమోటర్-డైరెక్టర్ అయిన నీరజ్ బజాజ్.. ఈ ట్రిప్లెక్స్ హౌస్ కొనుగోలు చేశారు. 18000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న విలాసవంతమైన నివాసం.. దక్షిణ ముంబయిలోని వాల్కేశ్వర్‌లో ఇంకా నిర్మాణంలోనే ఉండటం గమనార్హం.
రియల్ ఎస్టేట్ మార్కెట్ వర్గాల ప్రకారం నీరజ్ బజాజ్, మాక్రోటెక్ డెవలపర్లు(లోధా గ్రూప్) మధ్య ఈ డీల్ జరిగింది. ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన డీల్‌గా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. రాజ్‌భవన్‌కు దగ్గర్లోని వాల్కేశ్వర్‌లో.. లోధా మలబార్ టవర్ నిర్మాణం జరుగుతోంది. పారిశ్రామికవేత్త బజాజ్.. ఈ అపార్ట్మెంట్లో మూడు ఫ్లోర్లు బుక్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన టోకెన్ అమౌంట్ సైతం చెల్లించారు. ఒక చదరపు మీటర్‌కు రూ.1.4 లక్షలకు చొప్పున.. మొత్తం రూ.252 కోట్లకు ఈ డీల్ కుదిరింది. భవనానికి బీఎమ్సీ నుంచి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ పొందిన తర్వాత మిగతా సొమ్ము.. చెల్లించే విధంగా వీరి మధ్య ఒప్పందం జరిగింది.
మొత్తం 31 అంతస్తులతో ఈ భవన నిర్మాణం జరుగుతోంది. 2026 జూన్ నాటికి ఈ నిర్మాణం పూర్తవుతుందని నిర్వహకులు చెబుతున్నారు. ఈ టవర్‌లో బజాజ్.. 29, 30, 31వ ఫ్లోర్లను కొనుగోలు చేశారు. ఇందులో ఎనిమిది కార్లకు సరిపడా పార్కింగ్ స్థలం కూడా ఉంటుంది. అదే విధంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఈ ట్రిప్లెక్స్ హౌస్‌లో ఉంటుంది. ప్రైవేట్ రూఫ్‌టాప్ టెర్రస్ సైతం అందుబాటులో ఉంటుందని నిర్వహకులు చెబుతున్నారు.