వృద్ధి పథంలో ఆర్థిక రథం త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల స్థాయికి - india economy since independence
India economy after independence మన ఐటీ ఔషధ వాహన రంగాలు దూసుకెళుతున్న తరుణంలో ప్రపంచంలో 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తోందనే ఆశలు రేకెతున్నాయి. స్వావలంబన దిశగా పయనమవుతుండగా అదే సమయంలో పేదరికం నిరుద్యోగం సమస్యలు భారత్‌ను వెంటాడుతున్నాయి. ఈ స్వాతంత్య్ర అమృత మహోత్సవాల వేళ మన ఆర్థిక రంగ ప్రగతి ప్రస్థానాలపై ప్రత్యేక కథనం
india economy after independence
By
Published : Aug 13, 2022, 9:51 AM IST
India economy after independence ఆంగ్లేయులు వేల సంవత్సరాల మన సంప్రదాయ ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారు. వారు వెళ్లిపోయే నాటికి ఎటుచూసినా సవాళ్లే. అధిక జనాభా, ఆహారానికి కొరత. భారీ పరిశ్రమల ఊసే లేదు. వాణిజ్యం కుంటుపడింది. పేదరికం, నిరుద్యోగం దేశాన్ని చుట్టుముట్టాయి. పైగా గిట్టుబాటు కాని వ్యవసాయం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నాటి పాలకులు ప్రణాళికల ఆలంబనగా ముందుకు సాగారు. ఫలితంగా అనూహ్య మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే. దాదాపు 7% వార్షిక వృద్ధితో, చైనా కంటే ముందున్నాం. దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల (రూ.240 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదిగి, ప్రపంచంలో ఆరో స్థానంలో నిలిచాం. జీడీపీ - కొనుగోలు శక్తి (పీపీపీ - పర్చేజింగ్ పవర్ పారిటీ) ప్రకారం చూస్తే అమెరికా, చైనా తర్వాత స్థానం మనదేశానిదే. అయితే.. పేదరికం, ఆర్థిక అసమానతలు దేశ ప్రగతి పరుగుల వేగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ సమస్యలను రానున్న 25 సంవత్సరాల్లో అధిగమించడం ఎలా??
పునాది పంచవర్ష ప్రణాళికలు:దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మిశ్రమ ఆర్థికవ్యవస్థకు రూపకల్పన చేసి, పంచవర్ష ప్రణాళికలకు శ్రీకారం చుట్టారు. మన ఆర్థిక వ్యవస్థలో ఇది కీలక మలుపు. ప్రణాళికల రూపకల్పన, పర్యవేక్షణ బాధ్యతలను 1950లో ఏర్పాటైన ప్రణాళికాసంఘం తీసుకుంది.
మొదటి ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం, పెద్దఎత్తున నీటి పారుదల సౌకర్యాలను కల్పించడం లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. భాక్రా నంగల్, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల ఆలోచనలకు అప్పుడే బీజం పడింది. దీని ఫలితాలు కూడా వెంటనే కనిపించాయి. వార్షిక వృద్ధి రేటు నిర్దేశించుకున్న లక్ష్యం కంటే అధికంగా 3.6% నమోదైంది.
మూడో ప్రణాళికా కాలంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో స్థిరీకరణ సాధ్యమైంది. స్పష్టమైన సామాజిక మార్పు కనిపించింది. నాల్గో ప్రణాళిక స్థానంలో మూడు వార్షిక ప్రణాళికలను ప్రభుత్వం అమలు చేసింది.
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 5వ ప్రణాళిక, జనతా పార్టీ ప్రభుత్వంలో 6వ ప్రణాళిక అమలయ్యాయి. 1990-92లో మనదేశం అతిపెద్ద ఆర్థిక ఉపద్రవాన్ని ఎదుర్కొంది. తప్పనిసరి పరిస్థితిలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. అందువల్ల 8వ ప్రణాళిక రెండేళ్లు ఆలస్యంగా మొదలైంది. సంస్కరణల ఫలితాలను ఆధారంగా చేసుకుని 9, 10, 11, 12 ప్రణాకలు ముందుకు సాగాయి.
2015లో ప్రణాళికా సంఘం స్థానంలో కేంద్ర ప్రభుత్వం 'నీతిఆయోగ్'ను ఏర్పాటు చేసింది. ప్రణాళికల అమలును నిలిపివేసింది.
రెండో ప్రణాళికలో పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేశారు. ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు, భారీ పరిశ్రమల ఏర్పాటుకు పునాది అప్పుడే పడింది.
జీఎస్టీ కళ్లు తిరిగే ఆదాయం:దేశంలో గత దశాబ్ద కాలంలో పన్ను సంస్కరణలు పెద్దఎత్తున అమలయ్యాయి. తొలుత వ్యాట్, ఆ తర్వాత జీఎస్టీ (వస్తు, సేవల పన్ను), ఇతర పన్నుల్లో క్రమబద్ధీకరణ జరిగింది. పారిశ్రామిక రంగాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ఎగుమతి, దిగుమతి సుంకాల్లో సమయానుకూలంగా మార్పులు చేస్తోంది. ప్రత్యక్ష పన్నుల విధానాల్లోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. జీఎస్టీ వసూళ్లు ప్రస్తుతం నెలకు రూ.1.40 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ప్రత్యక్ష పన్నుల ఆదాయమూ ప్రతినెలా రూ.లక్ష కోట్లకు పైగానే ఉంటోంది.
కీలక మలుపు ఆర్థిక సంస్కరణలు:గల్ఫ్ యుద్ధం, అనంతర ఆర్థిక పరిస్థితుల కారణంగా 1990 నాటికి మనదేశం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుపోయింది. చెల్లింపుల సంక్షోభం ముంచుకొచ్చింది. అప్పుటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు నడుంకట్టారు. ఆర్థికవేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా ఎంచుకున్నారు. వినూత్న విధానాలతో 1991లో నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. 'లైసెన్స్ రాజ్'ను దాదాపుగా రద్దు చేశారు. దీనివల్ల విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం కలగడంతోపాటు ప్రైవేటీకరణకు దారులు తెరుచుకున్నాయి. ఉత్పత్తి, సేవల రంగాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఆర్థికాభివృద్ధి, సేవల రంగం విస్తరించడం, భారీగా విదేశీ మారకపు ద్రవ్యాన్ని కూడబెట్టుకోవడానికి పునాది 1991లోనే పడింది.
మార్పు పెరిగిన మధ్యతరగతి:ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం మనదేశంలో తీవ్రమైన పేదరికం 2011లో 22.5% ఉండగా, 2019 నాటికి 10.2 శాతానికి తగ్గింది. భారత్‌లో 2005-06 లో 63 కోట్లుగా ఉన్న పేదలు 2015-16 నాటికి 36 కోట్లకు తగ్గినట్లు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అధ్యయనం వెల్లడించింది.
విప్లవం మేటిగా మన ఐటీ:దేశంలో 1990లలో మొదలైన ఐటీ విప్లవం, వై2కే (2000 సంవత్సరం) తర్వాత జోరందుకుంది. ఐటీ రంగం సాధించిన అసా ధారణ విజయాలతో మనపై మనకు ఆత్మ విశ్వాసం పెరగడంతోపాటు ప్రపంచ దేశాలు మన సత్తాను గుర్తించడం మొదలైంది. దాదాపు 200 బిలియన్ డాలర్ల(రూ.16 లక్షల కోట్లు) ఐటీ పరిశ్రమను అతికొద్దికాలంలో సాధించిన ఘనత మన సొంతం.
22 బిలియన్ డాలర్ల (రూ.1.76 లక్షల కోట్లు) వార్షిక ఎగుమతులతో భారత ఔషధ పరిశ్రమ అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్జించింది.
రానున్న రెండు దశాబ్దాలు కీలకం:దేశ ప్రగతిని పేదరికం నిరుద్యోగం, నిరక్షరాస్యత గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. 2025 వరకు ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్ల(రూ.400 లక్షల కోట్ల) స్థాయికి తీసుకెళితే ఇవన్నీ పరిష్కారమవుతాయి. 2030-35 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల(రూ.800 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని ముందుకు సాగాల్సి ఉంది. రానున్న 2దశాబ్దాలలో ఇవన్నీ జరగాలంటే.. సంస్కరణలను వేగవంతం చేయాలి. రూ.16 లక్షల కోట్ల మేరకు ప్రభుత్వ రంగ సంస్థల్లోని వాటాలను విక్రయించాలి.
హైవేలు, హైస్పీడ్ రైళ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విద్యుత్తు ప్రాజెక్టులపై రానున్న పదేళ్లలో రూ.120 లక్షల కోట్లను వెచ్చించాలి.
విద్య, వైద్యానికి జీడీపీలో నిధులను అరకొరగా కేటాయిస్తున్నారు. ఒక్కో దానికి కనీసం 6% నిధులిస్తే దీర్ఘకాలంలో ప్రజారోగ్యం మెరుగుపడుతుంది. విద్యారంగం పరుగులు తీస్తుంది.
వెలుగు-నీడ: భారీగా ఆర్థిక అసమానతలు:పేద, ధనిక తారతమ్యాలు ప్రధాన సమస్య. జాతీయ ఆదాయంలో 22% కేవలం 1% జనాభా వద్ద ఉంది. దేశ మొత్తం ప్రజల సగటు వార్షిక ఆదాయం రూ.2.04 లక్షల కోట్లు. అయితే సగం జనాభా సగటు ఆదాయం రూ.53,610 మాత్రమే. అదే సమయంలో 10% జనాభా సగటు ఆదాయం రూ.11.66 లక్షలు ఉండటం గమనార్హం.
పట్టణ, గ్రామీణ ప్రజల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు అధికంగా కనిపిస్తున్నాయి. గ్రామాల్లో 28.4% కుటుంబాలు తక్కువ ఆదాయాలతో సరిపెట్టుకుంటూ ఉండగా, పట్టణాల్లో 3.1% కుటుంబాలు మాత్రమే తక్కువ ఆదాయాలను కలిగి ఉన్నాయి. పట్టణాల్లో 44.4% మంది, గ్రామాల్లో 7.1% మంది సంపన్నులు ఉన్నారు.
బ్రిటిష్ ఆర్థికవేత్త- ఆంగస్ మాడిసన్ విశ్లేషణ ప్రకారం 1700 సంవత్సరం నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 24.4%. పరాయి పాలన పర్యవసానంగా.. 1950 నాటికి అది 4.2 శాతానికి పడిపోయింది.
బ్రిక్స్, జీ-20 కూటముల్లో భారత్ స్థానం సంపాదించడం.. 600 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి.. ఐటీ- టెలికాం, ఔషధ, వాహన తయారీ రంగాల్లో గణనీయ వృద్ధి.. మనదేశ విజయాలకు గీటురాళ్లు.
1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్య్రం లభించింది అంటే.. రాజకీయ, సామాజిక అంశాల్లో మాత్రమే కాదు.. ప్రజలకు ఆర్థిక స్వేచ్ఛ లభించింది కూడా ఆ రోజే. మన ఆర్థిక వ్యవస్థ బ్రిటిష్ ఉక్కు సంకెళ్లను తెంచుకుని, తనదైన పంథాలో ఎదిగేందుకు అవకాశం కలిగిన రోజది. అక్కడి నుంచి దాదాపు రెండు దశాబ్దాలపాటు తడబాట్లు, బాలారిష్టాలు తప్పలేదు. ఆ తర్వాత పరిస్థితి గాడిన పడి.. భారతావని బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతూ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గత రెండు దశాబ్దాల్లో శరవేగంగా వృద్ధిని నమోదు చేస్తూ.. ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించింది.
మన ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్ల (దాదాపు రూ.80 లక్షల కోట్లు) స్థాయిని అందుకోవడానికి దాదాపు 60 ఏళ్లు పట్టింది. ఆ తర్వాత 12 ఏళ్ల వ్యవధిలోనే 2 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. అక్కడి నుంచి వృద్ధి మరింత వేగం అందుకుంది. కేవలం అయిదేళ్లలోనే 3 లక్షల కోట్ల డాలర్ల మార్కునూ అందుకోగలిగింది. 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకునేలా పరుగులు తీస్తోంది.
వ్యవసాయం ప్రధానంగా ఉన్న మనదేశం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని బలమైన ఉత్పత్తి, సేవల రంగాన్ని నిర్మించుకోగలిగింది. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో ఉత్పత్తి రంగం బహుముఖంగా విస్తరించి వ్యవసాయం, సేవల రంగాల కంటే పెద్దది కాబోతోంది. దీనివల్ల సమీప భవిష్యత్తులో జపాన్, జర్మనీ, బ్రిటన్ దేశాలను మించిపోయి అమెరికా, చైనా తర్వాత మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నో విజయాలు మన ఖాతాలో వేసుకున్నప్పటికీ, దక్షిణ కొరియా వంటి చిన్న దేశం కూడా అద్భుతంగా పురోగమించిన తీరు చూస్తే.. భారత్ సాధించాల్సింది ఇంకెంతో ఉందన్నది వాస్తవం.
వ్యయం: పరిశోధన, అభివృద్ధి ముఖ్యం:సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి. ఈమేరకు పరిశోధన-అభివృద్ధిపై పెద్దఎత్తున నిధులు ఖర్చు చేయాలి. పరిశోధనలపై అమెరికా తన జీడీపీలో 2.76% నిధులను, దక్షిణ కొరియా 4.04% ఖర్చు చేస్తుండగా, మనం 1%లోపే ఖర్చు చేస్తున్నాం.
ఆదర్శం: చైనా, దక్షిణ కొరియా:1947, ఆ తర్వాత మనతోపాటు ఎన్నో దేశాలకు స్వాతంత్య్రం లభించింది. వాటిలో చైనా, దక్షిణ కొరియా ఉన్నాయి. మనదేశం ఇంకా ఆర్థిక సమస్యలతో తల్లడిల్లుతుంటే చైనా, దక్షిణ కొరియాలు అనూహ్య ఆర్థిక ప్రగతి సాధించాయి. చైనా రూ.960 లక్షల కోట్ల జీడీపీతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటే, మనదేశం రూ.240 లక్షల కోట్లతో ఆరో స్థానంలో నిలిచింది. చైనాలో తలసరి ఆదాయం దాదాపు 5,000 డాలర్లు(రూ.4 లక్షలు) ఉండగా, మనదేశం ఇంకా 2,000 డాలర్ల (రూ.1,60,000) కంటే తక్కువ కలిగి ఉంది. చైనాతో మనదేశానికి దాదాపు 40 బిలియన్ డాలర్ల (రూ.3.20 లక్షల కోట్లు)కు పైగా వర్తక లోటు ఉండటం గమనార్హం. మనదేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలుపెట్టి 30 ఏళ్లు అయింది. అప్పటికే దక్షిణ కొరియా, చైనా బలమైన ఆర్థిక వ్యవస్థలుగా అవతరించాయి.