తెలంగాణ

telangana

ETV Bharat / business

మ్యూచువల్‌ ఫండ్లలో ఇన్వెస్ట్​ చేస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి! - mutual funds investments caring points

Mutual Funds: దీర్ఘకాలంలో సంపద సృష్టించాలనుకున్న మదుపరులకు మ్యూచువల్‌ ఫండ్లు ఒక మంచి ఎంపికే. ఆర్థిక లక్ష్యాల సాధనకు ఇటీవల కాలంలో ఎంతోమంది వీటిని ఎంచుకుంటున్నారు. తొలిసారి మార్కెట్లో మదుపు చేసేవారూ.. పెట్టుబడుల కోసం వీటిని పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఫండ్లకు తోడు.. కొత్తగా ఎన్‌ఎఫ్‌ఓలూ రానుండటం వల్ల మదుపరులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అవేంటంటే?

mutual funds
mutual funds

By

Published : Jul 3, 2022, 12:52 PM IST

Mutual Funds: సెబీ నిబంధనల నేపథ్యంలో గత కొంతకాలంగా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు కొత్త పథకాలను (న్యూ ఫండ్‌ ఆఫర్‌- ఎన్‌ఎఫ్‌ఓ) ఆవిష్కరించలేదు. జులై 1 నుంచి మళ్లీ ఎన్‌ఎఫ్‌ఓలను విడుదల చేసేందుకు నియంత్రణ సంస్థ అనుమతించడంతో.. మార్కెట్లో వీటి సందడి కనిపించనుంది. అన్ని మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలూ కొత్త పథకాలతో సిద్ధంగా ఉన్నాయి. ఈ సందర్భంలో ఫండ్లలో మదుపు చేసేవారు పరిశీలించాల్సిన అంశాలేమిటి? తెలుసుకుందాం.

నష్టభయం ఎంత మేరకు..
ఈక్విటీ ఆధారిత పథకాల్లో మదుపు చేసేటప్పుడు కచ్చితంగా నష్టభయాన్ని అంచనా వేసుకోవాలి. దీని ఆధారంగానే ఏ పథకాలను ఎంచుకోవాలన్నది తెలుస్తుంది. ఉదాహరణకు పదేళ్లలో పెద్ద మొత్తాన్ని జమ చేయాలని భావిస్తున్నారనుకుందాం.. అప్పుడు.. కాస్త నష్టభయం అధికంగా ఉన్న పథకాలను పెట్టుబడి కోసం పరిశీలించవచ్చు. వీటిలో రాబడీ ఎక్కువగానే వస్తుంది. మీరు అనుకుంటున్న మొత్తాన్ని సాధించేందుకు నెలకు ఎంత మొత్తాన్ని మదుపు చేయాలన్నది నిర్ణయించుకోవాలి. దీనికోసం మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల వెబ్‌సైట్లలో ఉన్న కాలిక్యులేటర్లను ఉపయోగించుకోవచ్చు. ఎన్‌ఎఫ్‌ఓలో మదుపు చేయాలనుకున్నప్పుడు.. ఆయా ఫండ్ల నష్టభయాన్ని తెలియజేసే రిస్కో మీటర్‌ను పరిశీలించాలి.

వైవిధ్యం ఉండేలా..
మీ దగ్గరున్న మొత్తం డబ్బును ఒకే పథకంలో మదుపు చేయడం ఎప్పుడూ సరికాదు. పాత ఫండ్లు కానీయండి.. ఎన్‌ఎఫ్‌ఓకు వస్తున్న పథకాలకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇప్పటికే మీరు మదుపు చేస్తున్న పథకాల విభాగంలో కొత్తగా వస్తున్న ఫండ్లను పట్టించుకోవద్దు. మీ దగ్గరున్న పథకానికి భిన్నంగా ఉన్న ఫండ్లనే మదుపు కోసం ఎంపిక చేసుకోవాలి. పెట్టుబడులు వైవిధ్యంగా ఉన్నప్పుడే... నష్టభయం పరిమితంగా ఉంటుందని మర్చిపోవద్దు. మీరు అంచనా వేసుకున్న రాబడినిచ్చే వరకూ భిన్న పథకాలను ఎంచుకొని, మదుపు కొనసాగించండి.

దీర్ఘకాలంలో..
పెట్టుబడిని దీర్ఘకాలం కొనసాగించాలి అనేది మార్కెట్‌ సూత్రం. అయితే, సరైన ఫండ్‌ను ఎంచుకున్నప్పుడే ఇది సరిపోతుంది. ఒక ఫండ్‌ పనితీరు ఏమాత్రం బాగాలేకపోతే.. వెంటనే దాని నుంచి బయటకు రావాలి. అంటే.. ప్రామాణిక సూచీని ఈ రాబడి లెక్కల కోసం పరిశీలించాలి. అదే విభాగంలోని ఇతర ఫండ్లతో పోలిస్తే.. ఇది ప్రతికూల పనితీరును చూపిస్తే.. దాన్ని మార్చేయాలి. అంతేకానీ, పెట్టుబడిని మొత్తంగా ఆపేయకూడదు.

ఒకేసారా? నెలనెలా?
స్టాక్‌ మార్కెట్‌లో వివిధ దశలను గమనిస్తూ పెట్టుబడులు కొనసాగించాలి. ఒకేసారి మదుపు చేస్తే.. అధిక నష్టభయాన్ని భరించేందుకు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి పెట్టుబడులకు డెట్‌ ఫథకాలే సరిపోతాయి. ఈక్విటీల్లో మదుపు చేయాలంటే.. ఎప్పుడూ క్రమానుగత పెట్టుబడులే మేలు. దీనివల్ల రూపాయి సగటు ప్రయోజనం అందుతుంది. కొత్తగా వస్తున్న ఎన్‌ఎఫ్‌ఓలు, పాత ఫండ్‌ పథకాలకూ ఇదే వ్యూహం పాటించాలి. ఒకవేళ ఏక మొత్తంలో మదుపు చేయాలనుకుంటే.. ముందుగా లిక్విడ్‌ ఫండ్లలో మదుపు చేసి, తర్వాత ఎస్‌టీపీ విధానంలో ఎంపిక చేసుకున్న ఫండ్లలోకి నెలనెలా నిర్ణీత మొత్తాన్ని మళ్లించాలి.

సమీక్షించుకోండి..
మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసినప్పుడు క్రమం తప్పకుండా వాటి పనితీరును సమీక్షిస్తూ ఉండాలి. కొన్నిసార్లు మన ఫండ్‌ అనుకున్న రాబడికన్నా తక్కువగా ఇస్తుండవచ్చు. కొన్నిసార్లు మంచి పనితీరుతో అధిక లాభాలను అందిస్తుంది. పనితీరు బాగాలేని ఫండ్ల నుంచి రాబడిని ఇస్తున్న ఫండ్లలోకి పెట్టుబడులు మార్చాలి. మీరు అనుకుంటున్న లక్ష్యం దగ్గరకు వస్తున్నప్పుడు.. అధిక నష్టభయం ఉన్న పథకాల్లో ఉన్న మొత్తాన్ని తక్కువ నష్టభయం ఉండే పథకాల్లోకి మళ్లించాలి.

చరిత్రను చూడాలి..
వివిధ మార్కెట్‌ దశల్లో ఒక ఫండ్‌ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలి. దీన్ని బట్టి పెట్టుబడి నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ కొత్త ఫండ్‌ను ఎంపిక చేసుకుంటే.. ఆ పథకం పెట్టుబడి వ్యూహం ఎలా ఉందో తెలుసుకోవాలి. ఎన్‌ఎఫ్‌ఓని అందిస్తున్న ఫండ్‌ సంస్థ ఎలాంటిదో చూడాలి. గతంలో వచ్చిన కొత్త పథకాల పనితీరు ఎలా ఉందో అంచనా వేయాలి. డైరెక్ట్‌ ప్లాన్లను ఎంచుకుంటే.. ఖర్చుల నిష్పత్తి తక్కువగా ఉంటుంది.

ఇవీ చదవండి:మార్కెట్లు క్రాష్: ఆ ఒక్కటి చూసి షేర్లు కొనొద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్!

కుబేరులను పెద్దదెబ్బ తీసిన 2022.. కోట్లకు కోట్లు లాస్​!

ABOUT THE AUTHOR

...view details