తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​పై యాపిల్​ కన్ను.. ఐఫోన్​ తయారీలో మన హవా ఎంత? - iPhone 14 in India

చైనాలో వరుస లాక్‌డౌన్‌లు, అమెరికా-చైనా సంఘర్షణ నేపథ్యంలో ఐఫోన్​ తయారీ విషయంలో సందిగ్ధంలో ఉన్న యాపిల్​ సంస్థ చూపు భారత్‌పై పడింది. ఈ తరుణంలోనే ఎటువంటి వ్యాపారావకాశాలు, ఉద్యోగావకాశాలను ఇవ్వబోతోందన్నదే ప్రశ్న భారతీయుల్లో మొదలయ్యింది.

Apple Tasks Second Assembly Partner in India With iPhone 14 Production
Apple Tasks Second Assembly Partner in India With iPhone 14 Production

By

Published : Nov 13, 2022, 7:29 AM IST

భారత్‌లో యాపిల్‌ ఐఫోన్‌ 14 అసెంబ్లింగ్‌ సెప్టెంబరులోనే మొదలైంది. తాజాగా మరో సరఫరాదారు(పెగాట్రాన్‌) కూడా ఈ మోడల్‌ ఐఫోన్ల తయారీకి ముందుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్పత్తిని అన్ని ప్రాంతాల్లోనూ విస్తరించాలన్న కంపెనీ ఆలోచనల్లో భాగమే ఇది. ఇందుకు కారణమూ ఉంది. ఐఫోన్‌ తయారీలో ఎక్కువగా పాలుపంచుకుంటున్న చైనాలో వరుస పెట్టి లాక్‌డౌన్‌లు రావడం; అమెరికా-చైనా మధ్య సంఘర్షణ వాతావరణం కనిపించడం వల్ల యాపిల్‌ చూపు భారత్‌పై పడింది. ఇది మనకు ఎటువంటి వ్యాపారావకాశాలు, ఉద్యోగావకాశాలను ఇవ్వబోతోందన్నదే అసలు ప్రశ్న. అది చైనాకు భారత్‌ ఎంత వరకు పోటీనివ్వగలుగుతుందన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది.

2017లో భారత్‌లో విస్ట్రాన్‌ ద్వారా ఐఫోన్‌ అసెంబ్లింగ్‌ మొదలైంది. ఇపుడు ఐఫోన్ల తయారీ పెంపునకు.. భారత్‌లో సరఫరాదార్లయినై తైవాన్‌ కంపెనీలు ఫాక్స్‌కాన్‌, పెగాట్రాన్‌, విస్ట్రాన్‌లు ఆసక్తి చూపుతున్నాయి. ఈ ఏడాది మొదట్లో ఐఫోన్‌ 12 హ్యాండ్‌సెట్ల తయారీ(తమిళనాడు)ని భారత్‌లో మొదలుపెట్టిన పెగాట్రాన్‌.. ఇపుడు ఐఫోన్‌ 14 తయారీని సైతం చేపట్టనుందని వార్తలు వెలువడుతున్నాయి.

ఇక 2022-23లో భారత్‌లో ఐఫోన్ల తయారీని ఫాక్స్‌కాన్‌ 150% మేర పెంచాలని భావిస్తోంది. ఈ కంపెనీ ఇక్కడ ఉత్పత్తి చేసే ఐఫోన్లు అంతర్జాతీయ సరఫరాలో ప్రస్తుతం 2-4 శాతంగానే ఉండగా.. వచ్చే కొన్నేళ్లలో 40-45 శాతానికి పెంచాలని ప్రణాళికలు రచిస్తుండడం ఐఫోన్ల తయారీలో చైనాతో భారత్‌ పోటీపడడానికి వీలు కల్పించే అంశం.

దేశీయ కంపెనీలు సైతం..
భారత దిగ్గజాలైన టాటా గ్రూప్‌, వేదాంతాలు కూడా ఐఫోన్ల తయారీకి సంయుక్త సంస్థల ఏర్పాటుకు చర్చలు జరుపుతున్నాయి. టాటా అయితే హోసూరు ప్లాంటులో ఐపోన్‌ మోడళ్లకు మెకానిక్స్‌ సరఫరా చేయడం కోసం 45,000 మందిని నియమించుకుంటోంది కూడా. విస్ట్రాన్‌తో జత కట్టాలనీ చర్చిస్తోంది.

దేశంలో భారీగా కార్మిక శక్తి ఉండడం, కార్మిక వ్యయాలు తక్కువ కావడం వల్ల కూడా చైనాకు వెలుపల భారతే అత్యుత్తమ తయారీ కేంద్రంగా కనిపిస్తోంది. అయితే జేపీ మోర్గాన్‌ సర్వే ప్రకారం.. 2025 కల్లా మొత్తం ఐఫోన్‌ తయారీలో భారత్‌ వాటా ప్రస్తుతమున్న 6 శాతం నుంచి 25 శాతానికి చేరినా.. అప్పటికీ చైనా వాటా 94 శాతం నుంచి 75 శాతానికి మాత్రమే తగ్గుతుంది. అంటే చైనాదే పైచేయిగా ఉంటోంది.

మన బలం పెరగాలంటే..
చైనా వాటాను తగ్గించగలిగినా.. భారత్‌(2), వియత్నాం(3)లు ఆ దేశం తర్వాతి స్థానాల్లోనే ఉంటాయి. ఎందుకంటే.. చైనా తన ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో సరఫరా వ్యవస్థలపై భారీగా పెట్టుబడులు పెడుతూ వచ్చింది. దీంతో ఆర్థిక వ్యవస్థ అసాధారణ వేగాన్ని అందుకోవడంతో ప్రపంచంలోనే తయారీ శక్తిగా ఆ దేశం మారింది. ఐఫోన్‌ కేంద్రంగా ఉండడం వల్ల ఆ లాభాల్లో ఎక్కువ వాటా చైనాకే వెళుతోంది. విచిత్రం ఏమిటంటే భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోనే చైనా కంపెనీ ఫోన్లదే ఆధిపత్యం.

యాపిల్‌ మార్కెట్‌ వాటా చైనాతో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువ. ఈ విషయంలో రాణించాలంటే భారత్‌ మరిన్ని పెట్టుబడులు పెట్టాలి. అందుకు అనుగుణంగానే 2026 కల్లా ఎలక్ట్రానిక్స్‌ తయారీ 300 బిలియన్‌ డాలర్ల పరిశ్రమగా మార్చాలని ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఎక్కువ భాగం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం ద్వారా మొబైల్‌ ఫోన్ల తయారీ ద్వారానే సాధించాలనుకుంటోంది. భారత్‌లో తయారీకి దిగ్గజం టెక్‌ కంపెనీలను ఈ పథకం ఆకర్షిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. (పీఎల్‌ఐ పథకం కింద పెగాట్రాన్‌ రూ.1132 కోట్ల పెట్టుబడులు పెట్టాలనీ భావిస్తోంది.)

ధర తగ్గుతుందా?
ఇటీవల ప్రకటించిన గూగుల్‌ పిక్సెల్‌ 7 ఫోన్‌ ధరలు ఇతర దేశాల కంటే భారత్‌లో 20 శాతం వరకు అధికంగా ఉన్నాయి. పన్నులు, కస్టమ్స్‌.. ఇలా స్థానిక అంశాల ఆధారంగానే ధర నిర్ణయించామని కంపెనీ చెబుతోంది. అలాగే ఐఫోన్‌ ధరలూ ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఐఫోన్‌ 14నే తీసుకుంటే అమెరికాలో దాని ప్రారంభ ధర 799 డాలర్లు కాగా.. ఇక్కడ 980 డాలర్లు పలుకుతోంది. అధిక పన్నుల వల్ల ఇక్కడ ధర పెరుగుతోంది. చైనాలో 843 డాలర్లు మాత్రమే.

అక్కడ హై ఎండ్‌ విడిభాగాలు లభ్యమవుతుండడమే కారణం. అంటే భారత్‌లో తయారీ చేపట్టినా కూడా మనం విడిభాగాలపై, ఇతరత్రా మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. దిగుమతులపై ఆధారపడడం తగ్గించి, ఇక్కడ విడిభాగాల తయారీ, మౌలిక వసతులను బలోపేతం చేసుకుంటే స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను భారత్‌ అందిపుచ్చుకోవచ్చు. ధరలూ కిందకు దిగివస్తాయి. ఇవన్నీ జరిగితే కంపెనీలకు వ్యాపారావకాశాలు, తద్వారా ప్రజలకు ఉద్యోగావకాలు పెరుగుతాయన్నది కాదనలేని వాస్తవం.

ఇదీ చదవండి:రెండేళ్లలో నాలుగు రెట్ల ఉద్యోగాలు.. చైనాపై ఆధార పడకుండా ఫాక్స్‌కాన్‌ ఇండియా ప్లాన్​!

ట్విట్టర్​లో బ్లూటిక్​.. ఫేక్​ అకౌంట్​ తెరిచిన దుండగులు.. కంపెనీకి రూ.లక్ష కోట్లు నష్టం

ABOUT THE AUTHOR

...view details