తెలంగాణ

telangana

ETV Bharat / business

Apple iPod: ముగిసిన ఐపాడ్‌ శకం.. తయారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన యాపిల్‌ - యాపిల్‌ ఐపాడ్‌

Apple iPod: దాదాపు రెండు దశాబ్దాల పాటు సంగీత ప్రియులను అలరించిన యాపిల్‌ ఐపాడ్‌ కథ ముగిసింది. వీటిలో చివరి వెర్షన్‌ అయిన 'ఐపాడ్‌ టచ్‌' తయారీని నిలిపివేస్తున్నట్లు యాపిల్‌ ప్రకటించింది. యాపిల్‌ ఆదాయానికి ఇప్పుడు ప్రధాన వనరుగా నిలుస్తోన్న ఐఫోన్‌, ఐప్యాడ్‌, ఎయిర్‌పాడ్స్‌.. అన్నీ ఐపాడ్‌ నుంచి పురుడుపోసుకున్నవే!

Apple iPod
apple ipod touch

By

Published : May 11, 2022, 11:23 PM IST

Apple iPod: సంగీతం, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమల్లో కొత్త శకానికి నాంది పలికిన యాపిల్‌ ఐపాడ్‌ కథ ఇక ముగిసింది. వీటిలో చివరి వెర్షన్‌ అయిన 'ఐపాడ్‌ టచ్‌' తయారీని నిలిపివేస్తున్నట్లు యాపిల్‌ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న స్టాక్స్ ముగిసే వరకు విక్రయాలు కొనసాగుతాయని తెలిపింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం మార్కెట్‌లోకి ఐపాడ్‌ రంగప్రవేశం చేసింది. అప్పటి వరకు వాక్‌మన్‌, రేడియోలు, కంప్యూటర్లలో మాత్రమే సంగీతం వినగలిగేవారికి కొత్త అనుభూతిని తీసుకొచ్చింది.

.

చేతిలో పట్టుకోగలిగే చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరంలో 1000 పాటలనందించి సంగీత ప్రియుల చెవిలో సరిగమలు పలికించింది. సాంకేతికంగా, సంగీతపరంగా వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని.. యూజర్లకు అప్‌డేటెడ్‌ వెర్షన్లతో ఆనందాన్ని పంచింది. కాలక్రమంలో యాపిల్‌ ఈ ఐపాడ్‌కే ఫోన్‌ ఫీచర్లను జతచేసి ఐఫోన్‌ను తీసుకొచ్చింది. ఫలితంగా మ్యూజిక్‌ ఫీచర్లకు మాత్రమే పరిమితమైన ఐపాడ్‌కు ఆదరణ తగ్గిపోయింది. మొబైల్‌ ఫోన్ల వాడకం పెరగడం.. అందులో రకరకాల మ్యూజిక్‌ ప్లేయర్లు అందుబాటులోకి రావడం వల్ల ఐపాడ్‌లకు ఆదరణ తగ్గింది. తాజాగా అందుబాటులో ఉన్న ఐపాడ్‌ టచ్‌ను 2019లో తీసుకొచ్చారు. తర్వాత ఎలాంటి కొత్త వెర్షన్లను విడుదల చేయలేదు.

.
.

2014 నుంచే ఐపాడ్‌ల తయారీకి యాపిల్‌ ప్రాధాన్యం తగ్గించింది. ఆ ఏడాదే ఐపాడ్‌ క్లాసిక్‌ ఉత్పత్తిని నిలిపివేసింది. 2017లో ఐపాడ్‌ నానో, ఐపాడ్‌ షఫిల్‌ను కూడా తయారీ నుంచి తొలగించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐపాడ్‌ టచ్‌ను ఫోన్‌ ఫీచర్లు లేని ఐఫోన్‌గా అభివర్ణిస్తుంటారు. అలాగే ఐఫోన్‌ చీపర్‌ వెర్షన్‌గానూ పేర్కొంటుంటారు. ఐపాడ్‌ ద్వారా ఆనందిస్తున్న మ్యూజిక్‌ ఫీచర్లను తమ ఐఫోన్‌, యాపిల్‌ వాచ్‌, హోమ్‌పాడ్‌ మినీ, మ్యాక్‌, ఐప్యాడ్‌, యాపిల్‌ టీవీలకూ అనుసంధానించామని యాపిల్‌ తెలిపింది.

.
.
.
.

యాపిల్‌ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ తొలిసారి మార్కెట్‌కు పరిచయం చేసిన ఈ ఐపాడ్‌ ఒకరకంగా చెప్పాలంటే ఆ కంపెనీ చరిత్రను తిరగరాసింది. దాదాపు దివాలా దశకు చేరుకున్న సంస్థలో ఆర్థిక జవసత్వాలు నింపి ఇప్పుడు ప్రపంచంలోనే తొలిసారి మూడు ట్రిలియన్‌ డాలర్ల విలువను అందుకున్న కంపెనీగా నిలిపింది. యాపిల్‌ ఆదాయానికి ఇప్పుడు ప్రధాన వనరుగా నిలుస్తోన్న ఐఫోన్‌, ఐప్యాడ్‌, ఎయిర్‌పాడ్స్‌.. అన్నీ ఐపాడ్‌ నుంచి పురుడుపోసుకున్నవే!

ఇవీ చదవండి:

మార్కెట్లోకి 'టాటా నెక్సాన్ మ్యాక్స్' ఈవీ​.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 437 కి.మీ జర్నీ

ఓలా, ఉబర్​కు కేంద్రం వార్నింగ్.. ఎందుకలా చేస్తున్నారంటూ..?

ABOUT THE AUTHOR

...view details