Apple Removed Employees: గత కొంతకాలంగా దిగ్గజ టెక్ కంపెనీలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో ఖర్చు తగ్గింపులపై దృష్టిపెట్టాయి. నియామకాలను తగ్గించుకోవడంతో పాటు ఉద్యోగుల్లో కోత వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం యాపిల్ కూడా ఇదే బాట పట్టింది. 100 మంది కాంట్రాక్టు రిక్రూటర్లను విధుల నుంచి తొలగించింది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ కథనం వెల్లడించింది.
యాపిల్ కొత్త నియామకాలు తగ్గించుకున్న నేపథ్యంలో రిక్రూటర్ల అవసరం తగ్గింది. దీంతో ఆ విభాగంలో ఉన్న ఒప్పంద సిబ్బందిని సంస్థ తొలగించింది. 100 మంది ఒప్పంద రిక్రూటర్ల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. వారికి రెండు వారాల వేతన చెల్లింపులతో పాటు ఇతర వైద్యపరమైన ప్రయోజనాలు అందుతాయని పేర్కొంది. అయితే పూర్తిస్థాయి రిక్రూటర్లను మాత్రం విధుల్లో కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ ప్రస్తుత ఆర్థిక అవసరాల మేరకే ఈ కోతలు చేపట్టినట్లు యాపిల్ వివరణ ఇచ్చింది. యాపిల్‌లో ఉద్యోగుల కోతలు తప్పవని ఆ సంస్థ సీఈఓ టిమ్ కుక్ గత నెలలోనే సూచనప్రాయంగా వెల్లడించారు. ఖర్చు తగ్గింపుపై సంస్థ దృష్టి పెట్టిందని ఆయన అన్నారు.