తెలంగాణ

telangana

ETV Bharat / business

భారత్​పై దృష్టి సారించిన యాపిల్​! - యాపిల్ న్యూస్​

Apple india: ప్రముఖ సంస్థ యాపిల్​ భారత్​లో తమ తయారీ ప్లాంట్లను నెలకొల్పే యోచనలో ఉన్నట్లు వాల్​స్ట్రీట్ జర్నల్​ కథనాన్ని ప్రచురించింది. కరోనా కట్టడి నిమిత్తం చైనాలో విధించిన లాక్​డౌన్​ వల్ల తమ కార్యకలపాలు దెబ్బతినడమే కారణంగా భావిస్తున్నట్లు పేర్కొంది.

apple plant in india
apple plant in india

By

Published : May 23, 2022, 7:03 AM IST

Apple india: కరోనా కట్టడి నిమిత్తం చైనాలో ఇటీవల కఠిన లాక్‌డౌన్‌లు విధించారు. ఫలితంగా యాపిల్‌ తయారీ కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. దీంతో తమ ఉత్పత్తుల తయారీని చైనా వెలుపలకు మార్చాలనుకుంటున్నట్లు కంపెనీ తమ కాంట్రాక్టు తయారీదారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఈ విషయంపై వాల్‌స్ట్రీట్‌ జర్నల్ కథనాన్ని ప్రచురించింది. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్‌, వియత్నాంపై యాపిల్‌ దృష్టి సారించినట్లు సమాచారం.

మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కంపెనీగా ఉన్న యాపిల్‌ నిర్ణయం ఇతర పాశ్చాత్య కంపెనీలపైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలనుకుంటున్న కంపెనీలు భారత్‌ వైపు చూసే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌లతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడికి చైనా పరోక్షంగా మద్దతు పలకడాన్నీ ఆయా కంపెనీలు పరిగణనలోకి తీసుకోవచ్చు. యాపిల్‌ ఉత్పత్తులైన ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌ల తయారీ 90 శాతం చైనాలోనే జరుగుతోంది.

ఏప్రిల్‌లో చైనా విధించిన కఠిన లాక్‌డౌన్‌ల కారణంగా ప్రస్తుత త్రైమాసికంలో 8 బిలియన్‌ డాలర్లు విలువ చేసే విక్రయాలు దెబ్బతినే అవకాశం ఉందని యాపిల్‌ ఇటీవల తెలిపింది. పైగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చైనా ప్రభుత్వ ఆంక్షల కారణంగా దాదాపు రెండేళ్లుగా తమ ఇంజినీర్లు, అధికారులు తయారీ కేంద్రాలకు వెళ్లే అవకాశం లేకుండా పోయిందని పేర్కొంది. దీంతో తయారీకార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించడం కుదరడం లేదని తెలిపింది. గత ఏడాది తలెత్తిన విద్యుత్తు కోతలు కూడా తయారీపై తీవ్ర ప్రభావం చూపాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో చైనాకు దగ్గరగా ఉండే భారత్‌వైపు యాపిల్‌ చూస్తున్నట్లు సమాచారం. జనాభా, నైపుణ్యంగల మానవ వనరులు, తక్కువ ఖర్చుల విషయంలో భారత్‌, చైనా సమాన స్థాయిలో ఉండడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కొన్ని కాంట్రాక్టు కంపెనీలను భారత్‌లోనూ తమ తయారీని విస్తరించాలని యాపిల్‌ కోరుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మొత్తం ఐఫోన్‌ల తయారీలో భారత్‌ వాటా 3.1 శాతం. ఈ ఏడాది దాన్ని 6-7 శాతానికి పెరగనున్నట్లు కౌంటర్‌పాయింట్‌ నివేదిక తెలిపింది.

అయితే, చైనా తయారీ సంస్థలు భారత్‌కు బదులు వియత్నాంను ఎంపిక చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. గల్వాన్‌లో సైనిక ఘర్షణ తర్వాత భారత్‌-చైనా సంబంధాలు పూర్తిగా క్షీణించడమే ఇందుకు కారణం. మరోవైపు వియత్నాం ఇప్పటికే యాపిల్‌కు గట్టిపోటీనిస్తోన్న శాంసంగ్‌కు తయారీ హబ్‌గా ఉంది. మరోవైపు ఇప్పటికే యాపిల్‌ తయారీ కాంట్రాక్టును తీసుకున్న లక్స్‌షేర్‌ ప్రెసిషన్‌ ఇండస్ట్రీ వియత్నాంలో ఎయిర్‌పోడ్స్‌ను తయారు చేస్తోంది.

ఇదీ చదవండి:మరోసారి ఇన్ఫోసిస్​ సీఈఓగా​ పరేఖ్​.. తొలి వ్యక్తిగా గుర్తింపు!

ABOUT THE AUTHOR

...view details