Anand Mahindra: కొవిడ్ పుణ్యమా అని ఇటీవల కాలంలో ఫుడ్, గ్రాసరీ డెలివరీ కంపెనీలకు ఆదరణ పెరిగింది. అదే సమయంలో వాటి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో వినియోగదారులను ఆకర్షించేందుకు ఆయా కంపెనీలు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయి. ఇందులో భాగంగా 10 నిమిషాల్లోనే డెలివరీ అనే కొత్త స్లోగన్‌ను అందుకున్నాయి. తొలుత నిత్యావసర వస్తువులకే పరిమితమైన ఈ విధానం ఇటీవల ఫుడ్ డెలివరీ యాప్ అయినా జొమాటో సైతం అందిపుచ్చుకుంది. అయితే, దీనిపై పెద్ద ఎత్తున నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సైతం నెటిజన్లకు శ్రుతి కలిపారు. గంటలోనే కాస్త మెత్తబడ్డారు.
10 నిమిషాల్లో డెలివరీ గురించి తన అభిప్రాయం తెలుపుతూ టాటా మెమోరియల్ డైరెక్టర్ సీఎస్ ప్రమేశ్ తొలుత ట్వీట్ చేశారు. 10 నిమిషాల్లో నిత్యావసరాల డెలివరీ అనేది అమానవీయం, దీనివల్ల డెలివరీ బాయ్స్ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొనాల్సి వస్తుందని అందులో పేర్కొన్నారు. నిత్యావసర సరకులు 10 నిమిషాల్లో చేరకపోతే ఏమైపోదని, ఇలాంటివి ఆపాలని కోరుతూ ఆయా సంస్థలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందించారు. ఈ విషయంలో తాను ఏకీభవిస్తున్నట్లు పేర్కొన్నారు.