తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.619 పెట్టుబడికి రూ.2లక్షల లాభం.. ఈ షేరు ఐపీఓ సూపర్​హిట్! - ఏఎంటీడీ డిజిటల్ ప్రాఫిట్

AMTD digital share returns: బుల్ మార్కెట్లోనూ సాధ్యంకాని అనూహ్య పరిణామం జరిగింది. ఐపీఓలో ఓ షేరు దుమ్మురేపింది. మదుపర్లకు 32,660శాతం రాబడినిచ్చింది. రూ.619 పెట్టుబడి పెడితే.. ఒక్కో షేరుపై రూ.2లక్షలకు పైగా లాభం వచ్చింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఈ రికార్డు స్థాయి ట్రేడింగ్ నమోదైంది.

amtd-digital-shares-returns
amtd-digital-shares-returns

By

Published : Aug 4, 2022, 1:39 PM IST

AMTD digital price prediction: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం సహా పలు కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు గతకొన్ని నెలలుగా తీవ్ర ఒడుదొడుకుల్లో చలిస్తున్నాయి. అయితే, జులై నుంచి పరిస్థితి కొంత మెరుగుపడింది. ఏప్రిల్, జూన్‌ నాటి కనిష్ఠాలతో పోలిస్తే సూచీలు క్రమంగా కోలుకుంటున్నాయి. ఏదేమైనప్పటికీ.. ఈ తరుణంలో మార్కెట్లోకి ప్రవేశించడానికి సామాన్య మదుపర్లు జంకుతున్నారనే చెప్పాలి. లాభాల మాట అటుంచితే.. నష్టాలు రాకుండా ఉంటే చాలనుకునేవారే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో ఓ స్టాక్‌ 32,000 శాతం లాభం ఇస్తే ఎలా ఉంటుంది? బుల్‌ మార్కెట్లోనూ సాధ్యం కాని ఈ అనూహ్య పరిణామం ఇప్పుడు జరిగిందంటే నమ్మశక్యంగా లేదు కదా! కానీ, దీన్ని మీరు నమ్మాల్సిందే. ఎందుకంటే.. హాంకాంగ్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఏఎంటీడీ డిజిటల్‌ మదుపర్లకు లాభాల కుంభవృష్టి కురిపించింది మరీ!

AMTD digital IPO: ఏఎంటీడీ డిజిటల్‌ జులై 15న న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదైంది. దీని ఇష్యూ ధర 7.80 డాలర్లు కాగా.. 16.81 డాలర్ల వద్ద లిస్టయ్యింది. అంటే లిస్టింగ్‌లోనే 115 శాతం లాభాన్నిచ్చింది. అంతటితో ఆగలేదు. బుధవారం (ఆగస్టు 3, 2022) స్టాక్‌ మార్కెట్లు ముగిసే సమయానికి ఈ స్టాక్‌ ధర 1100 డాలర్లు. అంటే కేవలం మూడు వారాల్లో ఇష్యూ ధరతో పోలిస్తే మదుపర్లకు 14002 శాతం రాబడినిచ్చింది. మరోవైపు ఈ స్టాక్‌ ఆగస్టు 2న 2,555.30 డాలర్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఐపీఓలో షేర్లు దక్కించుకొని ఈ ధర వద్ద విక్రయించిన వారికి దాదాపు 32660 శాతం రాబడి వచ్చింది. ఈ పరిణామాన్ని సులువుగా అర్థం చేసుకోవడానికి మన కరెన్సీలో చెప్పుకొంటే.. దాదాపు రూ.619 వద్ద ఐపీఓలో షేరు దక్కించుకొని ఆగస్టు 2న బయటకొచ్చిన వారికి ఒక్కో షేరుపై రూ.2,02,395 లాభం వచ్చింది. అదే ఇప్పటికీ షేరును అట్టిపెట్టుకొని ఉండి ఉంటే ఆ షేరు ధర రూ.87,378.50గా ఉంది.

why is amtd digital stock rising: డిజిటల్‌ బిజినెస్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్యకలాపాల్లో ఉన్న ఈ సంస్థ ప్రస్తుత మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ 203 బిలియన్‌ డాలర్లు. ఈ విషయంలో ఆర్థిక దిగ్గజాలైన వెల్స్‌ ఫార్గో, మోర్గాన్‌ స్టాన్లీ, గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థల్ని సైతం దాటేసింది. పైగా ఏప్రిల్‌ 2021 నాటికి ఈ కంపెనీ ఆదాయం 25 మిలియన్‌ డాలర్లే కావడం గమనార్హం. మార్కెట్‌ విలువ పరంగా ఇప్పుడు ఈ కంపెనీ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక సంస్థ. బెర్క్‌షైర్‌ హాత్‌వే, జేపీ మోర్గాన్‌ చేజ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, ఇండస్ట్రియల్‌ అండ్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వంటి దిగ్గజాల సరసన చేరింది.

అయితే, ఈ స్టాక్‌ ఈ స్థాయిలో రాణించడానికి కారణం ఏంటన్నది చాలా మందికి అంతుచిక్కడం లేదు. తక్కువ పరిమాణంలో స్టాక్స్‌ని ఆఫర్‌లో ఉంచడం వల్ల డిమాండ్‌ పెరిగి స్టాక్‌ ఎగబాకినట్లు కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ఏఎంటీడీ గ్రూప్‌ కింద ఉన్న ఏఎంటీడీ ఐడియా షేర్లు సైతం గణనీయంగా పుంజుకున్నాయి. జులై 15 నుంచి ఈ కంపెనీ షేరు విలువ 458 శాతం ఎగబాకింది. స్టాక్‌ ఇలా అనూహ్యంగా పెరగడంపై ఏఎంటీడీ డిజిటల్‌ స్పందించింది. స్టాక్‌ ధరను ప్రభావితం చేస్తున్న అనుచిత కార్యకలాపాలేవీ తాము గుర్తించలేదని తెలిపింది.

ఏఎంటీడీ డిజిటల్‌ను కెల్విన్‌ ఛొయ్‌ ముందుకు నడిపిస్తున్నారు. ఈయనపై హాంకాంగ్‌లో నిషేధం కొనసాగుతోంది. కొన్ని కీలక వివరాలు వెల్లడించలేదన్న ఆరోపణలపై ఆయన ఈ నిషేధాన్ని ఎదుర్కొంటున్నారు. ఐదేళ్ల పాటు యూబీఎస్‌లో పనిచేసిన ఆయన 2016లో ఏఎంటీడీలో చేరారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 30వ స్థానంలో ఉన్న లి కా-షింగ్‌ నేతృత్వంలోని సీకే హచిసన్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌.. ఈ ఏఎంటీడీ కంపెనీలకు మాతృసంస్థ. ఏఎంటీడీ గ్రూప్‌లో 32.5 శాతం వాటాలున్న ఏఎంటీడీ డిజిటల్‌కు ఛొయ్‌ ఒక్కరే ప్రమోటర్‌గా ఉన్నారు. హాంకాగ్‌కు చెందిన ఈయనకు కెనడా పౌరసత్వం ఉంది. వాటర్‌లూ యూనివర్శిటీలో అకౌంటింగ్‌లో పట్టాపుచ్చుకున్న ఛొయ్‌.. తర్వాత కార్పొరేట్‌ రంగంలోకి అడుగుపెట్టారు.

ABOUT THE AUTHOR

...view details