వ్యయ నియంత్రణలో భాగంగా భారీ ఎత్తున ఉద్యోగాలు తొలగించేందుకు సిద్ధమైన ఇ-కామర్స్ సంస్థ అమెజాన్.. మరో ప్రకటన చేసింది. తన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫాంను మూసివేయనున్నట్లు వెల్లడించింది. భారత్‌లో హైస్కూల్ విద్యార్థుల కోసం దీనిని ప్రారంభించగా.. ఎటువంటి కారణం వెల్లడించకుండానే మూసివేత గురించి ప్రకటించింది.
గత ఏడాది ప్రారంభంలో అమెజాన్ అకాడమీ ప్లాట్‌ఫాంను తీసుకువచ్చింది. కరోనా వేళ.. ఆన్‌లైన్ లెర్నింగ్‌కు డిమాండ్ పెరగడం వల్ల ఈ వేదికను అందుబాటులోకి తెచ్చింది. జేఈఈ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్‌ను అందిస్తోంది. అయితే ఇప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత అమెజాన్ అకాడమీని మూసివేయాలని నిర్ణయానికి వచ్చామని సంస్థ ఓ ప్రకటన చేసింది. అయితే ప్రస్తుతమున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని దశలవారీగా దీనిని అమలు చేస్తామని చెప్పింది.
ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడం వల్ల విద్యాసంస్థలు యథావిధిగా నడుస్తున్నాయి. దాంతో ఆన్‌లైన్ విద్యను అందిస్తోన్న పలు సంస్థలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు బైజూస్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు అన్‌అకాడమీ, వైట్‌హ్యాట్ వంటి సంస్థలు కూడా లేఆఫ్స్‌ను ప్రకటించాయి.
ఉద్యోగులకు నవంబర్ 30 డెడ్‌లైన్!
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఉద్యోగులను తగ్గించుకునే ప్రక్రియను అమెజాన్ కూడా ప్రారంభించింది. 10 వేల మందిని తొలగించింది. వచ్చే ఏడాదిలో కూడా ఈ తొలగింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపింది. స్వచ్ఛందంగా రాజీనామా చేసి, వేతన సంబంధిత ప్రయోజనాలు తీసుకొని వెళ్లిపోవాలని కొందరు భారతీయ ఉద్యోగులకు సంస్థ సూచించినట్లు సమాచారం. సంస్థే కాంట్రాక్టును రద్దు చేయడానికి బదులుగా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని చెప్పడంతో వారంతా వాలంటరీ సెపరేషన్ ప్రొగ్రామ్(వీఎస్‌పీ)వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.