తెలంగాణ

telangana

ETV Bharat / business

కొనసాగుతున్న ఉద్యోగాల కోత.. అమెజాన్‌లో 10,000 మంది తొలగింపు! - Amazon news

Amazon Layoffs : ట్విట్టర్ బాటలోనే అమెజాన్​ కూడా పయనిస్తోంది. తాజాగా ఆ సంస్థ 10 వేల ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ తొలగింపులతో ఐటీ భవిష్యత్తుపై సర్వత్రా చర్చ నడుస్తోంది.

amazon plans to lay off 10 000 employees soon report
amazon plans to lay off 10 000 employees soon report

By

Published : Nov 15, 2022, 7:45 AM IST

Updated : Nov 15, 2022, 10:21 AM IST

Amazon Layoffs : అమెరికా ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థ అమెజాన్‌ 10,000 మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్‌, టెక్నాలజీ ఉద్యోగులను ఈ వారం నుంచే తొలగిస్తున్నట్లు సమాచారం. ఆర్థిక మందగమనం నేపథ్యంలో కొత్త నియామకాలు చేపట్టడాన్ని ఆపేసినట్లు, గతవారం అమెజాన్‌ ఓ ఉన్నతాధికారికి పంపిన అంతర్గత మెమో ద్వారా తెలుస్తోంది. అమెజాన్‌ రోబోటిక్స్‌ బృందంలో పనిచేస్తున్న వారికి పింక్‌ స్లిప్‌ (తొలగింపు లేఖ)లు ఇచ్చారని ఆ అధికారి చెప్పినట్లు ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ వెల్లడించింది. లింక్డ్‌ఇన్‌ ప్రకారం.. అమెజాన్‌ రోబోటిక్స్‌ విభాగంలో 3,766 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఎంత మందిని ఇంటికి పంపించారనే విషయంపై ఆ ఆంగ్ల వెబ్‌సైట్‌ కచ్చిత వివరాలను వెల్లడించలేదు. లాభదాయకత లేని కొన్ని విభాగాల్లోని ఉద్యోగులను, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవాల్సిందిగా సూచించినట్లు, 'లక్ష్యిత' ప్రాజెక్టుల్లో మాత్రం కొత్త నియామకాల ప్రక్రియను అమెజాన్‌ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్​లో ఒప్పంద ఉద్యోగుల తొలగింపు
ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌, సంస్థను తన చేతుల్లోకి తీసుకున్న వారానికే దాదాపు సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. తాజాగా పొరుగు సేవల విభాగంలోనూ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విభాగంలో సుమారు 3,000 మందిని ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే తొలగించినట్లు సమాచారం. కంపెనీ ఇ-మెయిల్‌, ఇంటర్నల్‌ కమ్యూనికేషన్‌ సిస్టమ్స్‌తో ఉద్యోగులు యాక్సెస్‌ కోల్పోయిన తర్వాతే, తాము లేఆఫ్‌లకు గురైనట్లు గుర్తించామని వారు చెప్పడం గమనార్హం. అమెరికాతో పాటు ఇతర దేశాల్లోని ట్విట్టర్ కార్యాలయాల్లో ఈ లేఆఫ్‌లు ఉన్నట్లు అంతర్జాతీయంగా కథనాలు వెలువడ్డాయి. ట్విట్టర్​కు చెందిన కంటెంట్‌ మోడరేషన్‌, స్థిరాస్తి, మార్కెటింగ్‌, ఇంజినీరింగ్‌, ఇతర విభాగాల్లోని పొరుగు సేవల ఉద్యోగులు తొలగింపునకు గురయ్యారు. వారిని తొలగించినట్లు కాంట్రాక్టర్లకు ఇ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారట. తాజా ఉద్యోగ కోతలపై ట్విట్టర్ /మస్క్‌ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు.

Last Updated : Nov 15, 2022, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details