తెలంగాణ

telangana

ETV Bharat / business

గంటల్లో లక్షల కోట్లు కోల్పోయిన అమెజాన్​ బాస్​

Amazon Jeff Bezos net worth: మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమెజాన్​ ఫలితాలు మదుపర్లను నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్​ సంపద కొన్ని గంటల వ్యవధిలోనే 20.5 బిలియన్​ డాలర్లు(రూ.1.56 లక్షల కోట్లు) ఆవిరైపోయింది. అమెజాన్​ నష్టాలకు కారణాలేంటి?

Amazon Jeff Bezos
అమెజాన్​ అధినేత జెఫ్​ బెజోస్

By

Published : Apr 30, 2022, 3:27 PM IST

Amazon Jeff Bezos net worth: అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపద కొన్ని గంటల వ్యవధిలో 20.5 బిలియన్‌ డాలర్లు (రూ.1.56 లక్షల కోట్లు) కరిగిపోయింది. శుక్రవారం కంపెనీ షేర్లు భారీ పతనాన్ని చవిచూడడమే ఇందుకు కారణం. అమెజాన్‌ షేరు నిన్న 14.05 శాతం పడిపోయి 2,485.63 డాలర్ల వద్ద స్థిరపడింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో అమెజాన్‌ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. 2015 తర్వాత కంపెనీ తొలిసారి నష్టాల్ని నమోదు చేసింది. అలాగే 21 ఏళ్ల తర్వాత తొలిసారి విక్రయాల వృద్ధి నెమ్మదించడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే కంపెనీ షేర్లు శుక్రవారం భారీ పతనాన్ని చవిచూశాయి.

2022లో 43 బి.డాలర్లు ఆవిరి:జెఫ్‌ బెజోస్‌కు అమెజాన్‌లో 11.1 శాతం వాటాలున్నాయి. ఆయన వ్యక్తిగత సంపదలో అధిక వాటా అమెజాన్ షేర్లదే. అమెరికాలో శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి బ్లూమ్‌బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం బెజోస్‌ సంపద 148 బిలియన్‌ డాలర్లుగా ఉంది. మొత్తంగా ఆయన శుక్రవారం ఒక్కరోజే తన సందపలో 12 శాతం పతనాన్ని చవిచూశారు. శుక్రవారం నష్టాలతో కలుపుకొని 2022లో ఇప్పటి వరకు బెజోస్‌ సంపద 43 బిలియన్‌ డాలర్ల మేర తరిగిపోయింది. అయినప్పటికీ.. ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నారు. 249 బిలియన్‌ డాలర్లతో ఎలాన్‌ మస్క్‌ తొలిస్థానంలో ఉన్నారు. బెజోస్‌ ఎదుర్కొన్న నష్టాలు కేవలం కాగితానికే పరిమితం. ఒకవేళ అమెజాన్‌ షేర్లు మళ్లీ పుంజుకుంటే.. ఆయన సంపద తిరిగి పెరుగుతుంది. అమెజాన్‌ షేర్ల పతనంతో శుక్రవారం అమెరికా ప్రధాన స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో ఒకటైన నాస్డాక్‌ సూచీ సైతం భారీగా దిగజారింది.

అమెజాన్‌ నష్టాలకు కారణాలివే:మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను అమెజాన్‌ గురువారం ప్రకటించింది. 3.84 బిలియన్‌ డాలర్ల నష్టాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 8.1 బిలియన్‌ డాలర్ల లాభాల్ని నివేదించింది. రివియాన్‌ మోటివ్‌ స్టాక్స్‌లో అమెజాన్‌ పెట్టిన పెట్టుబడి 7.6 బిలియన్‌ డాలర్ల నష్టాలకు కారణమైంది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా సంస్థ ఈ-కామర్స్‌ వ్యాపారంలో 1.28 బిలియన్‌ డాలర్ల ఆపరేటింగ్‌ నష్టాల్ని నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే నికరంగా మార్చి త్రైమాసికంలో అమెజాన్‌ నష్టాల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.

కొవిడ్‌ సమయంలో ఈ-కామర్స్‌ వ్యాపారం భారీగా పుంజుకున్న విషయం తెలిసిందే. దీంతో అమెజాన్‌ డిమాండ్‌కు అనుగుణంగా తమ కార్యకలాపాల్ని విస్తరించింది. కొత్త గిడ్డంగులను, స్టోర్లను నిర్మించింది. భారీ వేతనాలతో ఉద్యోగులను ఆకర్షించింది. క్రమంగా సాధారణ కార్యకలాపాలు పుంజుకుంటుండడంతో ప్రజలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ను తగ్గించారు. దీంతో అమెజాన్‌ వ్యాపారం నెమ్మదించింది. పైగా అధిక వేతనాలు, గిడ్డంగుల నిర్వహణ భారీ వ్యయంతో కూడిన వ్యవహారంగా మారింది. మరోవైపు ఇంధన ధరలు పెరగడంతో రవాణా వ్యయం సైతం భారంగా పరిణమించింది. అలాగే ద్రవ్యోల్బణం పెరగడంతో ఖర్చులు రెండు బిలియన్‌ డాలర్ల మేర పెరిగినట్లు అమెజాన్‌ ఇటీవల వెల్లడించింది.

ఇదీ చూడండి:Amazon-Future dispute: 'ఆ విషయంలో అమెజాన్ విజయవంతమైంది'

ABOUT THE AUTHOR

...view details