తెలంగాణ

telangana

ETV Bharat / business

Amazon-Future dispute: 'ఆ విషయంలో అమెజాన్ విజయవంతమైంది'

Amazon Future: తమ కంపెనీని అమెజాన్‌ నాశనం చేసిందని ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ ఆరోపించింది. ఈ విషయంలో అమెరికా వ్యాపార దిగ్గజం విజయవంతమైందని విమర్శించింది. వివాదం పరిష్కారం కాకుండా ఫ్యూచర్‌ ఆస్తులు స్వాధీనం చేసుకోవడాన్ని (ఫ్యూచర్‌ స్టోర్లను రిలయన్స్‌) నిలువరించాలంటూ అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.

Amazon Future
Amazon Future

By

Published : Apr 1, 2022, 8:24 PM IST

Amazon Future dispute: అమెజాన్‌-ఫ్యూచర్‌ గ్రూప్‌ మధ్య వివాదం కొనసా.. గుతూనే ఉంది. కోర్టు వెలుపల పరిష్కారం విఫలమవ్వడంతో ఈ వ్యవహారం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఈ సందర్భంగా తమ కంపెనీని అమెజాన్‌ నాశనం చేసిందని ఫ్యూచర్‌ రిటైల్‌ లిమిటెడ్‌ ఆరోపించింది. ఈ విషయంలో అమెరికా వ్యాపార దిగ్గజం విజయవంతమైందని విమర్శించింది. వివాదం పరిష్కారం కాకుండా ఫ్యూచర్‌ ఆస్తులు స్వాధీనం చేసుకోవడాన్ని (ఫ్యూచర్‌ స్టోర్లను రిలయన్స్‌) నిలువరించాలంటూ అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 4కు వాయిదా వేసింది.

Future Reatial: విచారణ సందర్భంగా ఫ్యూచర్‌ రిటైల్‌ తరఫున హరీశ్‌ సాల్వే ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు. రూ.1400 కోట్ల (అమెజాన్‌-ఫ్యూచర్‌ డీల్‌) కోసం రూ.26 వేల కోట్ల విలువైన కంపెనీని అమెజాన్‌ నాశనం చేసిందని ఫ్యూచర్‌ రిటైల్‌ విమర్శించింది. తాను ఏదైతే చేయాలనుకుందో ఆ విషయంలో అమెజాన్‌ విజయం సాధించిందని పేర్కొంది. దీంతో తమతో వ్యాపారానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపింది. ఫ్యూచర్‌ రిటైల్‌ స్టోర్లను రిలయన్స్‌ స్వాధీనం చేసుకోవడాన్ని ఉద్దేశిస్తూ.. భూములు లీజుకిచ్చిన వ్యాపారులు ఖాళీ చేయాలని నోటీసు ఇస్తే తాము ఏం చేయగలమని ప్రశ్నించింది. ఇప్పటికే 835 స్టోర్లను కోల్పోయామని, కేవలం 374 స్టోర్లు మాత్రమే మిగిలాయని ఫ్యూచర్‌ రిటైల్‌ పేర్కొంది.

ఈ సందర్భంగా ఫ్యూచర్‌ వాదనను అమెజాన్‌ ఖండించింది. అద్దె చెల్లించడానికి డబ్బులు లేవన్న కారణం చూపడం ఓ వ్యూహమని ఆరోపించింది. 800 స్టోర్లు స్వాధీనం చేసుకున్నా ఫ్యూచర్‌ రిటైల్‌ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేసింది. మధ్యవర్తిత్వ కోర్టులో ఈ వ్యవహారం తేలే వరకు ఆస్తులు స్వాధీనం చేసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అమెజాన్‌ ధర్మాసనాన్ని కోరింది. అయితే, భూ యజమానులు కోర్టు ముందు లేకుండా ఉత్తర్వులు ఎలా ఇవ్వగలమని కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 4కు వాయిదా వేసింది.

ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, లాజిస్టిక్స్‌ వ్యాపారాలను రూ.24,713 కోట్లతో స్వాధీనం చేసుకోవడానికి ఆర్‌ఐఎల్‌కు చెందిన రిలయన్స్‌ రిటైల్‌ 2020 ఆగస్టులో ఒప్పందం చేసుకుంది. అయితే అంతకుముందే ఫ్యూచర్‌ కూపన్స్‌తో ఒప్పందం చేసుకున్న అమెరికా రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ దీనిని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించడంతో, లావాదేవీ పూర్తికాలేదు. మధ్యవర్తిత్వ కోర్టులోనే ఈ కేసును పరిష్కరించుకోవాలని ఇరు పక్షాలూ నిర్ణయించాయి. ఈ లోపు ఆస్తుల స్వాధీనంపై అమెజాన్‌ సుప్రీంకోర్టు తలుపుతట్టింది.

ఇదీ చదవండి:రికార్డు స్థాయిలో జీఎస్​టీ వసూళ్లు.. రూ.1.42 లక్షల కోట్లు రాబడి

ABOUT THE AUTHOR

...view details