Aluminium Air Batterys: విద్యుత్ వాహనాల కోసం అధునాతన సాంకేతికతతో అల్యూమినియం-ఎయిర్ బ్యాటరీలను తయారు చేయడం కోసం భారత్, ఇజ్రాయిల్‌కు చెందిన దిగ్గజ కంపెనీలు జట్టు కట్టాయి. తద్వారా ఒకసారి ఛార్జింగ్‌తో ప్రయాణించగలిగే దూరాన్ని పెంచుకోవడంతో పాటు బ్యాటరీ దిగుమతులను తగ్గించుకోవచ్చు. అంతే కాదు ఇది ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి చేదోడుగా నిలిచి ఇంధన భద్రతను పెంచుతుందని భావిస్తున్నారు.
ఇవీ కంపెనీలు..:ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కో, ఇజ్రాయిల్‌కు చెందిన ఫినర్జీ, ఫినర్జీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ల సంయుక్త సంస్థ ఐఓసీ ఫినర్జీ(ఐఓపీ)లు కలిసి ఈ ఒప్పందం చేసుకున్నట్లు ఒక సంయుక్త ప్రకటనలో ఈ కంపెనీలు తెలిపాయి.
ఇదీ ఒప్పందం..: అవగాహన ఒప్పందం ప్రకారం.. ఫినర్జీ, ఐఓపీలు భారత్‌లో హిందాల్కోతో ప్రత్యేక భాగస్వామ్యం కుదుర్చుకుంటాయి. పరిశోధన-అభివృద్ధితో పాటు అల్యూమినియం ఎయిర్ బ్యాటరీల కోసం అల్యూమినియం ప్లేట్లను తయారు చేస్తాయి. ఈ బ్యాటరీల వినియోగం అనంతరం అల్యూమినియం రీసైక్లింగ్‌నూ చేస్తాయి.
ఉపయోగం ఏమిటంటే..:తక్కువ బరువు, అధిక ఇంధన సాంద్రత వల్ల అల్యూమినియం-ఎయిర్ బ్యాటరీ వల్ల ఒకసారి ఛార్జింగ్‌తో ప్రయాణించగలిగే దూరాన్ని ఎంచదగ్గరీతిలో పెంచుకోవడానికి వీలవుతుంది.