Dematerialisation Old policies : మీ వద్ద బీమా పాలసీ బాండ్లు, పాలసీ పేపర్లు ఉన్నాయా...? వాటన్నింటినీ త్వరలో డిజిటల్ పద్ధతికి మార్చుకోవాల్సిందే. అంతేకాదు.. కొత్తగా తీసుకునే పాలసీలకు బీమా కంపెనీలు ఎటువంటి బాండు కానీ పత్రాలు కానీ జారీ చేయవు. ఆయా పాలసీలు వాటిని కొనుగోలు చేసిన వినియోగదార్ల డీమెటీరియలైజేషన్ (డీమ్యాట్) ఖాతాల్లో జమ అవుతాయి. ఇప్పటికే ఇటువంటి విధానం షేర్లు, మ్యూచువల్ ఫండ్లకు అమలు చేస్తున్నారు. మదుపరులు కొనుగోలు చేసిన షేర్లను వారి డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయటం, షేర్లు విక్రయిస్తే, షేర్లను డీమ్యాట్ ఖాతా నుంచి కొనుగోలుదారుడి డీమ్యాట్ ఖాతాకు బదిలీ చేయటం ఎన్నో ఏళ్ల నుంచి అమల్లో ఉన్న విషయం తెలిసిందే. మ్యూచువల్ ఫండ్ యూనిట్లను డీమ్యాట్ ఖాతాల్లో జమ చేయటమూ అమల్లోకి వచ్చింది. ఇదే కోవలో బీమా పాలసీలను సైతం డీమ్యాట్ ఖాతాల్లో జమ చేసే విధానాన్ని అమలు చేయాలని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) సంకల్పించింది. తద్వారా నకిలీ పత్రాల బెడదను అరికట్టడంతోపాటు, పాలసీదారులకూ సౌలభ్యాన్ని పెంపొందించాలని భావిస్తోంది.
ఇప్పటికే ఉన్నా..:బీమా పాలసీలను డిజిటల్‌లో జారీ చేసి, డీమ్యాట్‌లో జమ చేయాలనే ఆలోచన ఈనాటిది కాదు. దాదాపు ఏడేనిమిదేళ్ల క్రితమే దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది. కొన్ని బీమా కంపెనీలు పాలసీలను ఇప్పటికే కొనుగోలుదార్ల డీమ్యాట్ ఖాతాల్లో జమ చేస్తున్నాయి. కానీ ఈ విధానం ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఈ అంశంపై ప్రస్తుతం ఐఆర్‌డీఏఐ ఛైర్మన్ దేబాశిష్ పాండ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీని ప్రకారం ఈ ఏడాది డిసెంబరు నుంచి కొత్తగా విక్రయించే బీమా పాలసీలను కొనుగోలుదార్ల డీమ్యాట్ ఖాతాల్లోనే జమ చేయాలని నియంత్రణ సంస్థ బీమా కంపెనీలకు స్పష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు తగిన సన్నాహాలు చేసుకోవాలనీ సూచించినట్లు సమాచారం. అంతేగాక పాత పాలసీలన్నింటినీ వచ్చే ఏడాది చివరి నాటికి డీమ్యాట్ చేయాలని నిర్దేశించినట్లు సంబంధిత వర్గాలు వివరిస్తున్నాయి.
ఇ-కేవైసీతో..:బీమా పాలసీలకు డీమ్యాట్ ఖాతా విధానాన్ని తప్పనిసరి చేసే క్రమంలో పాలసీల కొనుగోలుదార్లకు ఇ-కేవైసీ అనివార్యం కానుంది. పాలసీ కొనుగోలుదార్లు పాన్, ఆధార్ కార్డుల వివరాలు సమర్పించి ఇ-కేవైసీని పూర్తి చేయాలి. దీనివల్ల డీమ్యాట్ ఖాతా తెరవటం, బీమా పాలసీలను ఆ ఖాతాలో జమ చేయటం సులువుగా జరిగిపోతుంది. డీమ్యాట్ ఖాతాలను వినియోగదార్లు, డిపాజిటరీ సంస్థలైన ఎన్‌ఎస్‌డీఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్), సీడీఎస్‌ఎల్ (సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్)లలో ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఒకసారి డీమ్యాట్ ఖాతా తెరిచిన తర్వాత ఎన్ని బీమా పాలసీలు కొనుగోలు చేసినా, అవన్నీ ఆ డీమ్యాట్ ఖాతాలో జమ అవుతూ ఉంటాయి.