Akasa airlines flight: దేశవ్యాప్తంగా విమాన సేవలు అందించేందుకు మరో కొత్త సంస్థ అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ స్టాక్ మార్కెట్ మదుపరి రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా మద్దతు ఉన్న ఆకాశ ఎయిర్ ఆగస్టు 7నుంచి తమ కార్యకలాపాలను ప్రారంభిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. తమ తొలి సర్వీసును ముంబయి-అహ్మదాబాద్ మధ్య నడపనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఇప్పటికే టికెట్ బుకింగ్‌లు ప్రారంభించినట్లు తెలిపింది.
ఆగస్టు 13 నుంచి బెంగళూరు-కొచ్చి మధ్య కూడా సేవలు ప్రారంభిస్తామని ఆకాశ ఎయిర్ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి కూడా టికెట్లు ఇప్పటి నుంచే బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. రెండు బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలతో తమ వాణిజ్య కార్యకలాపాలకు కంపెనీ శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే ఒక విమానం భారత్‌కు చేరుకుంది. మరొకటి ఈ నెలాఖరు వరకు కంపెనీ చేతికి అందనుంది.