తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​టెల్ x జియో x వీఐ.. OTT యాక్సెస్​తో రూ.800లోపు బెస్ట్ ప్లాన్​ ఏది? - జియో రీఛార్జ్ ప్లాన్

స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఇప్పుడు బాగా పెరిగింది. కాస్త ఖాళీ సమయం దొరికినా ఫోన్లలో సినిమాలు, క్రికెట్ చూసేవారి సంఖ్య ఎక్కువైంది. ఓటీటీలకు అందరూ అలవాటు పడిపోయారు. దీని వల్ల మొబైల్స్‌లో డేటా త్వరగా అయిపోతోంది. దీంతో అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటాను ఇచ్చే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల వైపు చాలా మంది మళ్లుతున్నారు. కాబట్టి రూ.1,000 లోపు ఉన్న బెస్ట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు ఏంటో తెలుసుకుందాం.

AIRTEL VS JIO VS VI post paid plans with ott
AIRTEL VS JIO VS VI post paid plans with ott

By

Published : Apr 21, 2023, 12:03 PM IST

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల వినియోగం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొబైల్ తయారీ సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొనడం వల్ల తక్కువ ధరలకే మంచి ఫీచర్లు ఉన్న ఫోన్లు వచ్చేస్తున్నాయి. ఫోన్ లేనిదే ఏ పనీ కావడం లేదు. చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇలా ప్రతి దాంట్లోనూ స్మార్ట్‌ఫోన్ వాడకం తప్పనిసరిగా మారింది. ఏది ఆర్డర్ చేయాలన్నా, బుక్ చేయాలన్నా మొబైల్ ఉండాల్సిందే. యూపీఐ ద్వారా రోజువారీ ఆర్థిక లావాదేవీలు కూడా ఫోన్లలోనే అయిపోతున్నాయి.

రోజువారీ పనులు, అవసరాన్ని పక్కనబెడితే చాలా వరకు మొబైల్స్‌ను ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వాడే వారి సంఖ్య అధికంగా ఉంది. గేమ్స్ ఆడేందుకు, సినిమాలు, క్రికెట్ లాంటివి చూసేందుకు ఫోన్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. కరోనా సమయంలో ఓటీటీల వాడకం బాగా పెరిగింది. అన్ని భాషల్లోని చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి రావడం వల్ల అందరూ వాటికి అలవాటు పడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫోన్లలో కనీసం ఒక్క ఓటీటీ యాప్ అయినా ఉంటోంది.

ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లైవ్ క్రికెట్ చూడటం వల్ల డేటా భారీగా ఖర్చవుతుంది. కంటెంట్ క్వాలిటీ పెరుగుతున్న కొద్దీ డేటా త్వరగా అయిపోతుంది. రోజువారీ డేటా పూర్తిగా అయిపోతే ఇంటర్నెట్ వేగం తగ్గిపోతుంది. అదనపు డేటా కావాలంటే అదనంగా మరో డేటా ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి.

అయితే, ఇలాంటి వినియోగదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని టెలికం సంస్థలు కొన్ని ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నాయి. పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ డేటాతో పాటు ఓటీటీ వేదికల సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తున్నాయి. రూ.1,000 లోపు ధరకు ఓటీటీ బెనిఫిట్స్‌ను కూడా ఇస్తున్న బెస్ట్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్‌టెల్ రూ.599 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
ఎయిర్‌టెల్ సంస్థ రూ.599కి మంచి పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం ఉన్న ఈ ఆఫర్లో కుటుంబంలోని ఒక వ్యక్తికి అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా అమెజాన్ ప్రైమ్ ఆరు నెలల సబ్‌స్క్రిప్షన్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఎక్స్‌ట్రీమ్ మొబైల్ ప్యాక్‌నూ ఇస్తున్నారు. ఈ ఆఫర్‌లో నెలకు 105 జీబీ డేటా ఇస్తారు. ఇందులో ప్రైమరీ కనెక్షన్‌కు 75 జీబీ, యాడ్ ఆన్ కస్టమర్‌కు 30 జీబీ డేటా ఇస్తారు. అవసరాన్ని బట్టి డేటాను 200 జీబీ వరకు, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లుగానూ పొడిగించుకోవచ్చు. అయితే అదనంగా ఒక్కో కనెక్షన్‌కు రూ.299 చెల్లించాల్సి ఉంటుంది.

ఎయిర్‌టెల్ రూ.999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
ఈ ప్లాన్‌లో భాగంగా కస్టమర్ తన కుటుంబంలో ముగ్గుర్ని యాడ్ ఆన్స్‌గా ఎంచుకోవచ్చు. వీరికి అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇందులో నెలకు 190 జీబీ డేటా ఇస్తున్నారు. ప్రైమరీ కనెక్షన్‌కు 100 జీబీ, ప్రతి యాడ్ ఆన్ కస్టమర్‌కు 30 జీబీ చొప్పున డేటా అందుబాటులో ఉంటుంది. డేటా ప్లాన్‌ను 200 జీబీ, రోజుకు 100 మెసేజ్‌లు వరకు విస్తరించుకోవచ్చు. అయితే దీనికి అదనంగా మరో రూ.299 చెల్లించాలి. ఇందులో కూడా రూ.599 ప్లాన్ మాదిరిగానే ఆరు నెలల పాటు అమెజాన్ ప్రైమ్, ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఎక్స్‌ట్రీమ్ మొబైల్ ప్యాక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు.

జియో రూ.699 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. రూ.699 ప్లాన్‌లో ముగ్గురు యాడ్ ఆన్స్‌ను ఎంచుకునే వీలుంది. ఈ ప్లాన్‌లో 100 జీబీ డేటా, ప్రతి రోజూ 100 మెసేజ్‌లను అందిస్తున్నారు. ఒక ఏడాది అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ (బేసిక్) సబ్‌స్క్రిప్షన్‌తో పాటు జియో సినిమా, జియో టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఇస్తున్నారు. ఫ్యామిలీ యాడ్ ఆన్ మెంబర్‌కు జియో అదనంగా మరో రూ.99 ఛార్జ్ చేస్తోంది. జియో రూ.599తో మరో ప్లాన్‌ను కూడా అందిస్తోంది. అయితే యాడ్ ఆన్ కస్టమర్ ఆప్షన్ లేకుండా అన్‌లిమిటెడ్ డేటాతో పాటు పైప్రయోజనాలన్నీ కల్పిస్తోంది.

వొడాఫోన్ ఐడియా రూ.501 పోస్ట్ పెయిడ్ ప్లాన్
వొడాఫోన్ ఐడియా సైతం సరసమైన ధరలకే మంచి పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తోంది. రూ.501 ప్లాన్ కింద ఒక కనెక్షన్‌కు 90 జీబీ డేటా, నెలకు 3 వేల మెసేజ్‌లు, 200 జీబీ డేటాను అందిస్తోంది. అవసరాన్ని బట్టి డేటా వాడకాన్ని మరింతగా పొడిగించుకోవచ్చు. కాకపోతే దానికి అదనంగా కొంత మొత్తం చెల్లించాలి. ఈ ఆఫర్ కింద ఆరు నెలల పాటు అమెజాన్ ప్రైమ్, ఏడాది పాటు డిస్నీ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. వొడాఫోన్ మూవీస్, టీవీ యాప్‌నకు వీఐపీ యాక్సెస్ ఇస్తున్నారు. దీనికి అదనంగా రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్‌ను కూడా వీఐ అందిస్తోంది.

వొడాఫోన్ ఐడియా రూ.701 పోస్ట్‌పెయిడ్ ప్లాన్
రూ.701 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో మరిన్ని ప్రయోజనాలను అందిస్తోంది వొడాఫోన్. ఇందులో కూడా రూ.501 ప్లాన్‌లో మాదిరిగానే అన్‌లిమిటెడ్ డేటా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఏడాది సబ్‌స్క్రిప్షన్‌ను ఇస్తున్నారు.

ఓటీటీలు లేకుండానే..
ఇక, ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఆకర్షణీయమైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో ఆకట్టుకుంటోంది. బీఎస్ఎన్ఎల్ రూ.525, రూ.798, రూ.999 ప్లాన్లను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 85 జీబీ, 50 జీబీ, 75 జీబీ చొప్పున ప్లాన్లను బట్టి డేటాను ఇస్తోంది. అయితే ఎలాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ ఇవ్వకపోవడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details