Airtel 5g launch: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ 5జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు టెలికాం గేర్ల తయారీ సంస్థలైన ఎరిక్సన్, నోకియా, శాంసంగ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా సేవలు అందించేందుకు ఎరిక్సన్, నోకియాతో చాలా రోజుల నుంచి ఒప్పందం కొనసాగిస్తోంది. ఈ ఏడాది నుంచి శాంసంగ్‌తోనూ ఒప్పందం కొనసాగనుంది.
ఇటీవల నిర్వహించిన 5జీ స్పెక్ట్రమ్ వేలంలో 900MHz, 1800MHz, 2100MHz, 3300MHz, 26 GHz బ్యాండ్స్‌లో 19,867.8 MHZ స్పెక్ట్రమ్‌ను రూ.43,084 కోట్లకు ఎయిర్‌టెల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆ కంపెనీ సీఈఓ గోపాల్ ప్రకటించారు. 5జీ కనెక్టివిటీని వినియోగదారులకు అందించేందుకు ప్రపంచంలోనే పేరొందిన టెక్నాలజీ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.
5జీ స్పెక్ట్రమ్ వేలం 7 రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. రూ.1,50,173 కోట్ల విలువైన బిడ్లు దాఖలయ్యాయి. 10 బ్యాండ్‌లలో మొత్తం 72,098 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను అమ్మకానికి ఉంచగా.. 51,236 మెగాహెర్ట్జ్ (71 శాతం) మేర విక్రయమైందని, తొలి ఏడాది స్పెక్ట్రమ్ చెల్లింపుల కింద ప్రభుత్వానికి రూ.13,365 కోట్లు లభిస్తాయని కేంద్రం తెలిపింది. సాధ్యమైనంత వేగంగా 5జీ సేవలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జియో, ఎయిర్‌టెల్ ఆ రోజే ప్రకటించాయి.