Airtel tariff rates: ఈ ఏడాదిలో మరో దఫా పెంచే ఛార్జీలతో ప్రతి వినియోగదారు నుంచి ప్రతినెలా వసూలయ్యే సగటు మొత్తం (ఆర్పు) రూ.200కు చేరుతుందని భారతీ ఎయిర్‌టెల్ భారత్-దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్‌విత్తల్ చెప్పారు. సంస్థ లక్ష్యమైన ఆర్పు రూ.300కు చేరడం అయిదేళ్లలో సాకారమవుతుందని ఇన్వెస్టర్ కాల్‌లో వివరించారు. 2021 మార్చి త్రైమాసికంలో రూ.145గా ఉన్న ఆర్పు, 2022 మార్చి చివరకు రూ.178కి చేరిందని గుర్తు చేశారు. చిప్‌సెట్‌ల కొరత వల్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగినా కూడా, 4జీ సేవల్లోకి అదనపు వినియోగదారులను ఆకర్షించగలగడమే ఇందుకు కారణమని చెప్పారు. నెలవారీ అద్దె చెల్లించే (పోస్ట్‌పెయిడ్) ఖాతాదారుల సంఖ్య 20 కోట్లను అధిగమించినట్లు తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
- ద్రవ్యోల్బణం, కమొడిటీ ధరలు, ఇంధన ఛార్జీలు పెరగడం వల్ల వినియోగదారులపై ప్రభావం పడుతుంది. ఇది ఎంత అనేది పరిశీలించాల్సి ఉంది.
- 2021 మార్చి ఆఖరుకు ఎయిర్‌టెల్‌కు 32.1 కోట్ల మంది చందాదార్లు ఉంటే, 2022 మార్చి చివరకు ఈ సంఖ్య 32.6 కోట్లకు చేరింది.
- రాబోయే అయిదేళ్లలో బి2బి వ్యాపారం, బ్రాడ్‌బ్యాండ్ విభాగాలు మరింత పెద్దవి కావాలి. ఆర్పు రూ.300కు చేరాలన్నది లక్ష్యం.
- 2021-22లో కంపెనీ మూలధన పెట్టుబడులు రూ.25,661.6 కోట్లు కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఇంత లేదా 5జీ సేవల కనుగుణంగా కొంత అధికంగా ఉండొచ్చు.
- 2021 నవంబరు-డిసెంబరుల్లో దేశంలోని మూడు ప్రైవేటు టెలికాం సంస్థలు 18-25 శాతం మేర టారిఫ్‌లను పెంచాయి.