టెలికాం సేవలు మరింత ప్రియం కానున్నాయి. ఈ ఏడాది మధ్యలో టారిఫ్ ఛార్జీలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు భారతీ ఎయిర్‌టెల్ సీఈఓ సునీల్ భారతీ మిత్తల్ తెలిపారు. టెలికాం పరిశ్రమ వ్యాపారంలో మూలధన రాబడి తక్కువగా ఉన్నందున టారిఫ్ ఛార్జీలను స్వల్పంగా పెంచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వివిధ వస్తువులపై ప్రజలు చేస్తున్న ఖర్చుతో పోలిస్తే ఇది తక్కువే ఉంటుందన్నారు. దేశానికి బలమైన టెలికాం సంస్థ అవసరమన్న మిత్తల్.. భారత్ డిజిటల్-ఆర్థికవృద్ధి కల సాకారమైనట్లు వివరించారు. భారతీ ఎయిర్‌టెల్ గత నెలలో కనీస రీఛార్జ్ ధరను 57శాతం పెంచగా.. త్వరలోనే టారిఫ్ ధరలు పెంచేందుకు సిద్ధమవుతోంది.
10 మిలియన్లు దాటిన యూజర్లు..
భారతీయ ఎయిర్‌టెల్ 5జీ యూజర్లు 10 మిలియన్లు దాటినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. మార్చి 2024 చివరినాటికి 5జీ సేవలు దేశంలోని ప్రతీ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చేరువయ్యేటట్లు ప్లాన్ చేస్తున్నామని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది. ఎయిర్‌టెల్ దేశంలో 5జీ సేవలను 2022 అక్టోబరు 1న ప్రారంభించింది.