తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫ్రీగా అన్​లిమిటెడ్ 5జీ డేటా.. ఆ యూజర్లకు మాత్రమే.. కండీషన్స్ అప్లై!

అపరిమితంగా 5జీ డేటాను ఉచితంగా అందిస్తోంది ప్రముఖ మొబైల్ నెట్​వర్క్ కంపెనీ. దీనికి కొన్ని షరతులు వర్తిస్తాయని చెబుతోంది. మరి మీది అదే కంపెనీనా? మీరు ఫ్రీ 5జీ డేటా పొందేందుకు అర్హులేనా? చెక్ చేసుకోండిలా..

AIRTEL FREE 5G DATA
AIRTEL FREE 5G DATA

By

Published : Mar 20, 2023, 1:20 PM IST

ఎయిర్​టెల్ యూజర్లకు సూపర్​ న్యూస్. తమ వినియోగదారులకు ఫ్రీగా 5జీ డేటా అందిస్తోంది ఎయిర్​టెల్. అర్హులైన యూజర్లు అపరిమితంగా 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. 5జీ ప్లస్ నెట్​వర్క్​తో సాధారణ ఇంటర్నెట్​తో పోలిస్తే 30 రెట్లు వేగంతో ఈ డేటా వాడుకోవచ్చని ఎయిర్​టెల్ చెబుతోంది. కానీ, అందులో మెలిక పెట్టింది. అసలేంటీ ఫ్రీ డేటా? ఎవరికి వర్తిస్తుంది? ఎలా వాడుకోవచ్చో చూద్దాం పదండి..

అన్​లిమిటెడ్ ఫ్రీ 5జీ డేటా అనేది కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్ ఏం కాదు. ఇప్పటికే జియో వినియోగదారులకు ఈ వెసులుబాటు ఉంది. తాజాగా ఎయిర్​టెల్ ఇలాంటి సౌలభ్యాన్ని తమ వినియోగదారులకు అందిస్తోంది. ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే యూజర్ల వద్ద కచ్చితంగా 5జీ ఫోన్ ఉండాల్సిందే. 5జీ ఫోన్​లో ఎయిర్​టెల్ సిమ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఎయిర్​టెల్ థ్యాంక్స్/ మై ఎయిర్​టెల్ యాప్ డౌన్​లోడ్ చేసుకోవాలి. ఎయిర్​టెల్ థ్యాంక్స్/ మై ఎయిర్​టెల్ అనేది.. ఆ సంస్థ తమ వినియోగదారుల కోసం తీసుకొచ్చిన యాప్. అందులో ఖాతా వివరాలు, అమలులో ఉన్న ప్లాన్లు, డేటా వినియోగం వంటి సమాచారం ఉంటుంది. ఇది గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్​ స్టోర్​లో అందుబాటులో ఉంది.

మై ఎయిర్​టెల్ యాప్ డౌన్​లోడ్ చేసుకున్న వెంటనే.. దానిలో లాగిన్ అవ్వాలి. ఎయిర్​టెల్ మొబైల్ నెంబర్​ ఎంటర్ చేసి యాప్​లో లాగిన్ అవ్వొచ్చు. లాగిన్ అవ్వగానే యాప్​లో ఓ బ్యానర్ కనిపిస్తుంది. అన్​లిమిటెడ్ ఫ్రీ 5జీ డేటా అని కనిపించే ఆ బ్యానర్​పై క్లిక్ చేయాలి. వెంటనే ఫ్రీ 5జీ డేటా యాక్టివేట్ అయిపోతుంది. అనంతరం, 5జీ వేగంతో ఉచితంగా స్ట్రీమింగ్, డౌన్​లోడింగ్, అప్​లోడింగ్​ చేసుకోవచ్చు.

కండీషన్స్ ఇవే..
అయితే, ఎయిర్​టెల్ కంపెనీ ఇక్కడే ఓ మెలిక పెట్టింది. అన్​లిమిటెడ్ 5జీ డేటాను ఉచితంగానే ఇస్తున్నట్లు చెప్పి.. ఓ నిబంధన జోడించింది. యాక్టివ్ ప్లాన్ ఉన్నవారికే ఇది వర్తిస్తుందని పేర్కొంది. నెలకు రూ.239 లేదా అంతకుమించిన ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్న వారికే ఉచిత '5జీ ప్లస్' డేటా లభిస్తుందని స్పష్టం చేసింది. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులిద్దరికీ ఇదే నిబంధన వర్తిస్తుందని వివరించింది. మరోవైపు, రూ.455, రూ.1799 ప్లాన్​లతో రీఛార్జ్ చేసుకున్న యూజర్లకు ఈ ఆఫర్ వర్తించదని ఎయిర్​టెల్ తెలిపింది.

ఇదే కాకుండా, మరో షాకింగ్ నిబంధన పెట్టింది ఎయిర్​టెల్. ఫ్రీ 5జీ డేటాను యూజర్లు తమ ఫోన్లలో మాత్రమే వినియోగించుకునేలా రూల్ పెట్టింది. పీసీకి కానీ, ల్యాప్​టాప్​కు కానీ అనుసంధానం చేసి డేటా షేర్ చేసుకోలేరని ఎయిర్​టెల్ వెల్లడించింది. హాట్​స్పాట్ ద్వారా డేటా బదిలీ చేసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది. యూజర్లు వారి స్మార్ట్​ఫోన్లలో మాత్రమే ఈ డేటాను వినియోగించుకోవచ్చని తెలిపింది.

ఆ ప్రాంతంలోని వారికే..
ఎయిర్​టెల్ 5జీ సేవలు ప్రస్తుతం పరిమిత ప్రాంతాల్లోనే నడుస్తున్నాయి. దేశంలోని 265 నగరాల్లోనే ఈ సేవలను ప్రారంభించింది ఎయిర్​టెల్. ఈ ప్రాంతాల్లో నివసించే ఎయిర్​టెల్ యూజర్లకే ఈ ఆఫర్ ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది.

ABOUT THE AUTHOR

...view details