తెలంగాణ

telangana

ETV Bharat / business

మన కార్లు ఎంత సురక్షితం?.. కొనే ముందు వాటిని చూస్తున్నామా? - కార్లు కొనే ముందు చూడాల్సిన అంశాలు

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కారులో ప్రయాణిస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో మరోసారి వాహనాల భద్రతపై చర్చ మొదలైంది. ఇదివరకు కార్ల బడ్జెట్ గురించే ఆలోచించే వాహనదారుల ధోరణి ప్రస్తుతం మారిపోయిందని నిపుణులు చెబుతున్నారు. 'ఎంతవరకు సురక్షితం' అనే అంశమూ బడ్జెట్‌ కార్ల కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోందని పేర్కొంటున్నారు.

CARS safety measures
CARS safety measures

By

Published : Sep 6, 2022, 7:02 AM IST

cars safety rating 2022: దేశంలో వినియోగిస్తున్న కార్లు ఎంతవరకు సురక్షితమనే చర్చ కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. గతంలో తక్కువ ధర, మైలేజీపై మాత్రమే అత్యధికులు దృష్టి పెట్టేవారు. తదుపరి రోడ్డు ప్రమాదాల్లో సంభవిస్తున్న ప్రాణ నష్టాన్ని గమనించాక, తమ కారు 'ఎన్‌సీఏపీ క్రాష్‌ టెస్టింగ్‌' రేటింగ్‌ ఎంత అనే అంశాన్నీ దేశీయ వినియోగదారులు పరిశీలించుకుంటున్నారు. కాస్త ఎక్కువ ఖర్చయినా సురక్షితమనే అంచనాలున్న కార్లవైపే మొగ్గు చూపిస్తున్నారు. టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ఆదివారం మెర్సిడెస్‌ బెంజ్‌ కారులో ప్రయాణిస్తూ, రోడ్డు ప్రమాదంలో మరణించిన నేపథ్యంలో.. మరోసారి కారు ప్రయాణం, ఎయిర్‌బ్యాగ్‌ల అంశాలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి.

బడ్జెట్‌ కీలకం
దేశీయంగా కార్ల కొనుగోలులో బడ్జెట్‌ కీలకాంశం. ఖరీదైన, విలాసవంత కార్లు అన్ని రకాల సౌకర్యాలతో పాటు, ఎయిర్‌బ్యాగ్‌లతో సురక్షితమనే నమ్మకం ఉంది. అందుకే, ప్రముఖులు, వ్యాపారవేత్తలు తమ ప్రయాణాలకు వీటినే ఉపయోగిస్తుంటారు. మధ్యతరగతి, ఉన్నత మధ్య తరగతి వర్గీయుల కొనుగోళ్లలో ఇదివరకు ధరే కీలకం అయ్యేది.

ఇటీవలి నుంచి 'ఎంతవరకు సురక్షితం' అనే అంశమూ బడ్జెట్‌ కార్ల కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తోందని వాహన రంగ నిపుణులు పేర్కొంటున్నారు. రూ.30లక్షల లోపు కార్ల విక్రయాలే మన దేశంలో అధికం. కార్ల తయారీ సంస్థలు కూడా రెండు మూడేళ్లుగా ప్రయాణికుల భద్రతపై మరింతగా దృష్టి పెట్టాయి. ఖరీదైన కార్లు అంతర్జాతీయ ప్రమాణాలతో వస్తుండగా, రూ.10 లక్షల లోపు కార్లు స్థానిక పరిస్థితులను బట్టి రూపొందుతున్నాయి.ఇప్పుడు కొనుగోలుదార్ల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో చిన్న కార్లకూ సురక్షిత ప్రమాణాలను పాటించడం అనివార్యం అవుతోంది.

6 ఎయిర్‌బ్యాగ్‌లతో..
మన దేశంలో 2019 జులై నుంచి డ్రైవర్‌ సీటుకు ఎయిర్‌బ్యాగ్‌ను అన్ని కార్లకూ తప్పనిసరి చేశారు. 2021 ఏప్రిల్‌ నుంచి డ్రైవర్‌తో పాటు, ముందు సీటులో కూర్చునే ప్రయాణికుడికీ ఎయిర్‌బ్యాగ్‌ ఉండాలనే నిబంధన తీసుకొచ్చారు. అంటే ప్రతి కారుకూ రెండు ఎయిర్‌ బ్యాగ్‌లు, సీట్‌ బెల్ట్‌ ఇండికేటర్‌, రియర్‌ పార్కింగ్‌ సెన్సార్లు ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాహన తయారీదారులు ఈ ఆదేశాన్ని అంత తొందరగా అంగీకరించలేదు. కానీ, వినియోగదార్ల నుంచి ఒత్తిడి నేపథ్యంలో, ఈ నిబంధనను తమ ఉత్పత్తుల్లో తప్పనిసరి చేశాయి.

8 మందిలోపు ప్రయాణించే కార్లకు తప్పనిసరిగా 6 ఎయిర్‌ బ్యాగ్‌లు ఉండాలని గత ఏడాదే కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. ఈ ఏడాది అక్టోబరు నుంచి దీన్ని తప్పనిసరి చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. చాలావరకు పెద్ద కార్లు 7-8 ఎయిర్‌బ్యాగులతో వస్తున్నాయి. మధ్యస్థాయి, ఎస్‌యూవీల్లోనూ ఇప్పుడు 6 ఎయిర్‌ బ్యాగులు ఉంటున్నాయి. అయితే చిన్న కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌ల ఏర్పాటుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని కంపెనీలు పేర్కొంటున్నాయి.

.

వెనుక కూర్చున్న వారికీ భద్రత ఉండేలా
ఎన్‌సీఏపీ 5 స్టార్‌ రేటింగ్‌ ఉన్న బెంజ్‌ జీఎల్‌సీ స్పోర్ట్స్‌ వినియోగ వాహనం (ఎస్‌యూవీ)లో వెనుక సీటులో కూర్చున్న సైరస్‌ మిస్త్రీ, ఆదివారం నాటి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో వెనుక సీటులో కూర్చున్న వారు కూడా సీటు బెల్టు తప్పనిసరిగా వినియోగించాలని, వెనుక సీటులో కూర్చున్న వారికీ భద్రత కల్పించేలా.. వారి ముందువైపునా ఎయిర్‌బ్యాగ్‌ ఉండాలనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికుల రక్షణకు కర్టెన్‌ ఎయిర్‌బ్యాగులు మాత్రమే ఉన్నాయి. ప్రమాదం జరిగినప్పుడు వీటితోపాటు ముందు వరుస సీట్లు లేదా కారు పైకప్పు నుంచి ఎయిర్‌బ్యాగులు విడుదలయ్యేలా చూసేందుకు కార్ల సంస్థలు కొన్నాళ్లుగా పరిశోధనలు చేస్తున్నాయి. కొన్ని కార్లలో ఇన్‌ఫ్లేటెడ్‌ బెల్ట్‌ ఎయిర్‌బ్యాగులూ అందుబాటులోకి తీసుకురానున్నారు.

ABOUT THE AUTHOR

...view details