Add On Insurance Coverage : అనుకోకుండా హాస్పిటల్లో చేరినప్పుడు, ఆర్థికంగా ఆదుకునే బీమా ఉంటే పెద్ద ఊరట లభిస్తుంది. చాలామంది హెల్త్ ఇన్స్‌రెన్స్ పాలసీని తీసుకునే సమయంలో తక్కువ ప్రీమియం గురించే ఆలోచిస్తుంటారు. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా బీమా పాలసీ ఉండాలి. సమగ్ర ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ కొన్ని సమయాల్లో దాని ప్రయోజనాలు పరిమితంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటప్పుడే అనుబంధ పాలసీలు మనకు ఉపయోగకరంగా ఉంటాయి.
హెల్త్ ఇన్స్‌రెన్స్ పాలసీని ఎంచుకునే సమయంలో బీమా మొత్తం కీలకమైన అంశం. దీనికి అవసరమైన యాడ్ ఆన్‌లు, రైడర్లనూ తీసుకోవాల్సి ఉంటుంది. చాలా వరకు బీమా సంస్థలు.. ఇప్పుడు సమగ్ర హెల్త్ ఇన్స్‌రెన్స్ పాలసీకి అదనపు భద్రతను అందిస్తున్నాయి.
ప్రైమరీ హెల్త్ ఇన్స్‌రెన్స్ పాలసీతో పాటు ఐచ్ఛికంగా ఎంచుకోవాల్సిన కొన్ని ప్రత్యేక పాలసీలను అనుబంధ పాలసీలు (యాడ్-ఆన్) అంటారు. ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి కొన్ని అవసరాలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పాలసీలు ఉపయోగపడతాయి. కొంత ప్రీమియాన్ని అదనంగా వీటికోసం చెల్లించాల్సి ఉంటుంది. పర్సనల్, ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలున్న వారెవరైనా ఈ అనుబంధ పాలసీ కవరేజీలను తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం.. అనుబంధాలు లేదా రైడర్లకు వసూలు చేసే ప్రీమియం.. ప్రామాణిక పాలసీలో 30 శాతానికి మించి ఉండకూడదు.
ఇప్పుడు కొన్ని ప్రధాన అనుబంధ పాలసీలను గురించి తెలుసుకుందాం..
క్రిటికల్ ఇల్‌నెస్ కవర్..
Critical Illness Policy Coverage : సాధారణంగా అన్ని రకాల చికిత్సలకూ ఆరోగ్య బీమా పాలసీలు పరిహారం అందిస్తాయి. అలాంటి సందర్భంలో ప్రత్యేకంగా క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ ఎందుకనే ప్రశ్న వస్తుంది. ప్రామాణిక పాలసీలు కేవలం వైద్య ఖర్చులే భరిస్తాయి. తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు పెద్ద మొత్తంలో ఒకేసారి డబ్బును అందించవు. క్రిటికల్ ఇల్‌నెస్ కవర్ తీసుకున్నప్పుడు పాలసీదారుడికి ఏదైనా తీవ్ర అనారోగ్యాన్ని గుర్తిస్తే.. వెంటనే పాలసీ విలువ మేరకు పరిహారాన్ని బీమా సంస్థ అందిస్తుంది. పాలసీలో పేర్కొన్న వ్యాధుల బారిన పడినప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది.
వ్యక్తిగత ప్రమాద బీమా..
Personal Accident Insurance Policy : ప్రమాదాలకు ఎలాంటి వేచి ఉండే సమయం లేకుండానే హెల్త్ ఇన్సూరెన్స్‌లో రక్షణ లభిస్తుంది. హాస్పిటల్లో చేరినప్పుడైన ఖర్చులు మాత్రమే హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తాయి. పాలసీదారుడు పాక్షిక లేదంటే శాశ్వత వైకల్యం పొందినప్పుడు.. అతనికి ఆర్థిక భద్రత లభించదు. ఇలాంటి సమయాల్లోనే వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్ తోడ్పడుతుంది. దురదృష్టవశాత్తూ మరణిస్తే.. నామినీకి ఆ పాలసీ విలువ మొత్తం లభిస్తుంది.