తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇన్వెస్టర్లకు గౌతమ్ అదానీ ప్రత్యేక సందేశం.. అయినా ఆగని షేర్ల పతనం

పెటుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎఫ్​పీఓతో ముందుకు సాగకూడదని నిర్ణయించుకున్నామని పారిశ్రామిక వేత్త గౌతమ్​ అదానీ తెలిపారు. అదానీ ఎంటర్​ప్రైజెస్ బ్యాలెన్స్​ షీట్ బలంగా ఉందని స్పష్టం చేశారు. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో సంస్థకు మంచి ట్రాక్ రికార్డు ఉందని చెప్పారు. మరోవైపు, అదానీ షేర్లు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.

interest-of-my-investors-is-paramountgautam-adanis-first-response-after-calling-off-rs20000-crore
interest-of-my-investors-is-paramountgautam-adanis-first-response-after-calling-off-rs20000-crore

By

Published : Feb 2, 2023, 11:05 AM IST

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు బలమైన బ్యాలెన్స్‌ షీట్‌, సురక్షితమై ఆస్తులు ఉన్నాయని.. తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో అద్భుతమైన ట్రాక్‌ రికార్డ్ ఉందని ఆ సంస్థ అధిపతి గౌతమ్ అదానీ పేర్కొన్నారు. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్​పీఓ)పై ముందుకు వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయం.. సంస్థపై, కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. గత కొద్దిరోజులుగా అదానీ షేర్లు తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేక వీడియో సందేశం విడుదల చేశారు.

"ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్ ద్వారా సేకరించిన నిధులను ఖర్చు చేయకూడదని తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఆశ్చర్యపరిచేదే. కానీ మార్కెట్​ అస్థిరతను చూసుకుంటే ఎఫ్​పీఓతో కొనసాగడం నైతికంగా సరైనది కాదని బోర్డు భావించింది. పెట్టుబడిదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎఫ్​పీఓతో ముందుకు సాగకూడదని నిర్ణయించుకున్నాం. మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ పెట్టుబడిదారులు.. కంపెనీపై ఉంచిన విశ్వాసం, నమ్మకం.. మాకు భరోసా కలిగించింది. పెట్టుబడిదారుల నుంచి అధిక మద్దతు పొందడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను. వారి విశ్వాసం వల్లే నేను జీవితంలో చాలా సాధించాను. వారి పట్ల ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా పెట్టుబడిదారుల ఆసక్తి నాకు చాలా ముఖ్యమైనది."
--గౌతమ్​ అదానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్

ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా సేకరించిన నిధులను ఖర్చు చేయకూడదని నిర్ణయించుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బుధవారం రాత్రి తెలిపింది. ప్రస్తుతం మార్కెట్‌లో నెలకొన్న అస్థిరత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఎఫ్‌పీఓ ద్వారా సేకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడంతోపాటు, లావాదేవీలను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు అదానీ గ్రూప్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

మరింత పడిపోతున్న అదానీ షేర్లు..
మరోవైపు, ఎఫ్​పీఓను రద్దు చేసుకున్న తర్వాత అదానీ గ్రూప్​ షేర్లు మరింత క్షీణించాయి. ప్రారంభంలో అదానీ ఎంటర్​ప్రైజెస్​ 15 శాతం షేర్లు నష్టపోయింది. ప్రస్తుతం 8 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అదానీ పోర్ట్స్​ 3.3 శాతం, ఎన్​డీటీవీ 5శాతం నష్టపోగా.. అదానీ గ్రీన్​, అదానీ ట్రాన్స్​మిషన్​, అదానీ గ్యాస్​ చెరో 10 శాతం షేర్లు పతనమయ్యాయి. మరోవైపు, ఏసీసీ, అంబుజా సిమెంట్ షేర్లు మాత్రం లాభాల్లో పయనిస్తున్నాయి. అంబుజా సిమెంట్ 6శాతానికి పైగా లాభంతో ట్రేడవుతోంది.

ABOUT THE AUTHOR

...view details