edible oil price down: వంట నూనెల తయారీ, విక్రయ సంస్థలు తమ ఉత్పత్తుల గరిష్ఠ విక్రయ ధర (ఎంఆర్‌పీ)లను తగ్గించాయి. నూనె ప్యాకెట్లపై ముద్రించి ఉండే ధరతో పోలిస్తే, దుకాణాల్లో తక్కువకే విక్రయిస్తుంటారు. రైతుబజార్లతో పాటు దిగ్గజ సూపర్ మార్కెట్లు, బ్రాండెడ్ అవుట్‌లెట్లలో ధరలను పరిశీలించి, కొనుగోలు చేసుకుంటే మేలు కలుగుతుంది. అంతర్జాతీయంగా ధరలు తగ్గినందున, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో సంస్థలు చర్యలు ప్రారంభించాయి. సవరించిన ధరలతో నూనె ప్యాకెట్లు విపణిలోకి వస్తున్నాయి. ఫార్చూన్ బ్రాండ్‌పై ఉత్పత్తులు విక్రయించే అదానీ విల్మర్.. గరిష్ఠ విక్రయ ధరను లీటరుకు రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. మిగిలిన సంస్థలు కూడా ఇలానే ఎంఆర్‌పీలను సవరించాయి.
- ధారా బ్రాండ్ కింద వంట నూనెలు విక్రయిస్తున్న మదర్ డెయిరీ ఈనెల 7న సోయాబీన్, రైస్ బ్రాన్ నూనెలపై లీటరుకు రూ.14 వరకు ధరలు తగ్గించింది.
- ప్రియ ఫుడ్స్ సంస్థ హైదరాబాద్‌లోని తన బ్రాండెడ్ విక్రయశాలల్లో రైస్‌రిచ్ లీటరు రూ.172, సన్‌ఫ్లవర్ రూ.176, పామాయిల్ రూ.127, వేరుసెనగ నూనె రూ.170 చొప్పున విక్రయిస్తోంది.
ఫ్రీడం ఆయిల్: రెండు నెలల క్రితం లీటరు సన్‌ఫ్లవర్ ఆయిల్ గరిష్ఠ విక్రయ ధర రూ.220 కాగా, ఇప్పుడు రూ.192కు చేరిందని సంస్థ తెలిపింది. వివిధ విక్రయశాలల్లో ఇంత కంటే తక్కువే లభిస్తున్నట్లు సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. రెండు మూడు నెలల్లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముందటి స్థాయికి (రూ.145-150) దిగి రావచ్చన్నారు. డాలరు రేటు వల్ల ఈ ధరలు కొంత మేరకు ప్రభావితం కావచ్చన్నారు.