ఈ సంవత్సరంలో వాణిజ్య సంస్థలకు (ఎంటర్‌ప్రైజ్) 5జీ సేవలతో పాటు వినియోగదారు యాప్‌లు విడుదల చేయాలని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ వ్యాపారాన్ని ఇతర దేశాలోనూ విస్తరింపజేసేందుకు ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు. కృత్రిమ మేధ, మెషీన్ లెర్నింగ్ (ఏఐ-ఎంఎల్), పారిశ్రామిక క్లౌడ్ సామర్థ్యాలు, డేటా కేంద్రాల విస్తరణ వంటి వాటిపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారని ఒక నివేదిక వెల్లడించింది. దేశంలోని వివిధ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినందున, ఇకపై విదేశాల్లోనూ విస్తరించేందుకు చూస్తున్నామని కొత్త ఏడాది సందర్భంగా ఉద్యోగులకు గౌతమ్ అదానీ తెలిపారని సమాచారం.
గతేడాది 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొన్న సమయంలో, వినియోగదారులకు టెలికాం సేవలు అందించే యోచన లేదని గౌతమ్ అదానీ తెలిపారు. సొంత సంస్థలకు ఎంటర్‌ప్రైజ్ సేవల కోసమే స్పెక్ట్రమ్‌ను కొద్దిమేర కొనుగోలు చేశారు.
కొత్త యాప్‌లు.. వాణిజ్య సంస్థలకు 5జీ సేవలు.. అదానీ నయా ప్లాన్! - అదానీ మెషీన్ లెర్నింగ్ రంగంలో పెట్టుబడులు
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ తన గ్రూప్ వ్యాపారాన్ని ఇతర రంగాలకు విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు ఐటీ రంగంపై దృష్టిసారించిన అదానీ.. ఈ ఏడాది వాణిజ్య సంస్థలకు (ఎంటర్‌ప్రైజ్) 5జీ సేవలతో పాటు వినియోగదారు యాప్‌లు విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అనూహ్యంగా యాప్‌లు
వ్యాపార సంస్థల నుంచి వినియోగదార్లు కొనుగోళ్లు చేసేందుకు వీలుగా ఉండే (బీ2సీ) యాప్‌ల ప్రకటన మాత్రం అదానీ గ్రూప్ నుంచి ఎవరూ ఊహించలేదు. 2023లో డేటా కేంద్రాలను విస్తరించడం ద్వారా, డిజిటల్ వైపు వేగంగా అడుగులు వేస్తామని అదానీ తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ)- మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) సామర్థ్యాలను నిర్మించడం, పారిశ్రామిక క్లౌడ్ సామర్థ్యాలు, 5జీ సేవలు, బీ2సీ యాప్‌లతో లక్షల మంది వినియోగదార్లకు చేరువయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తారని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ వృద్ధికి వెన్నెముకగా 20వ శతాబ్దంలో ముడి చమురు నిలిస్తే, 21వ శతాబ్దంలో చౌకైన హరిత ఎలక్ట్రాన్స్‌ను ఉత్పత్తి చేసే దేశాలకు, కంపెనీలకు కలిసొస్తుందని, ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు గౌతమ్ అదానీ వెల్లడించారు.
టెలికాంలో పోటీ పడతారా?
టెలికాం వ్యాపారానికి సంబంధించిన పూర్తి స్థాయి ప్రణాళికలు అదానీ గ్రూప్ నుంచి బయటకు రాలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ మాత్రం 5జీ నెట్‌వర్క్ కోసం ఈ ఏడాది డిసెంబరు నాటికి రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సొంత సంస్థల వృద్ధి, సంస్థల వ్యూహాత్మక కొనుగోళ్లతో అదానీ సంపద గత ఏడాదిలో 116 శాతం పెరిగింది. ఇదే సమయంలో ముకేశ్ అంబానీ సంపద 11 శాతమే వృద్ధి చెందింది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుని ముందుకు దూసుకెళ్తున్న అదానీ, 5జీ ఎంటర్‌ప్రైజ్ సేవలు, వినియోగదారు యాప్‌ల విడుదలతో ఎన్ని సంచలనాలకు తెర తీస్తారో వేచి చూడాలి.