అదానీ గ్రూప్ అవకతవకలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న తరుణంలో అదానీ పోర్ట్, అదానీ గ్రీన్ ఎనర్జీ మూడో త్రైమాసికం ఫలితాలను ప్రకటించాయి. మంగళవారం విడుదల చేసిన ఫలితాల్లో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(APSEZ) నికర లాభం 12 శాతం క్షీణించింది. డిసెంబర్ 2022 వరకు ముగిసిన Q3లో రూ. 1,336 కోట్ల లాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే సమయంలో సుమారు రూ. 1,535 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. మూడో త్రైమాసికంలో అదానీ పోర్ట్స్ రూ. 5,051 కోట్లు అర్జించగా.. రూ. 3,507 కోట్లను వెచ్చించింది. గతేడాది ఇదే సమయంలో రూ.4,713 లాభం రాగా.. రూ. 2,924 కోట్లు వెచ్చించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 14,500- 15,000 కోట్ల ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది.
రెండు రెట్లు లాభం గడించిన అదానీ ఎనర్జీ
అదానీ గ్రీన్ ఎనర్జీ మంగళవారం మూడో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రెండు రెట్లు లాభాన్ని గడించింది. గతేడాది ఇదే సమయానికి రూ. 49 కోట్ల లాభం రాగా.. ఈసారి రూ. 103 కోట్ల లాభాన్ని పొందింది. అదానీ ఎనర్జీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ. 2,258 కోట్ల ఆదాయాన్ని అర్జించగా.. గతేడాది Q3లో రూ. 1,471 కోట్ల ఆదాయాన్ని సాధించింది.
లాభాల్లో అదానీ షేర్లు
కొన్ని రోజులుగా నష్టాల్లో ట్రేడవుతున్న అదానీ గ్రూప్‌నకు సంబంధించిన అనేక సంస్థలు మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాలను గడించాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ 14 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 5 శాతం లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 5 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 3 శాతం, అదానీ విలిమర్ 5 శాతం, ఎసీసీ 3 శాతం, అంబుజా సిమెంట్స్ 3.20 శాతం లాభాన్ని నమోదు చేశాయి. మరోవైపు మార్కెట్లో లిస్ట్ అయిన 10 కంపెనీల్లో అదానీ టోటల్ గ్యాస్ 5 శాతం, అదానీ పవర్ 2.93 శాతం నష్టపోయాయి.