Adani Mauritius Investment :అదానీ గ్రూప్‌లో పెట్టుబడులపై మరోసారి ఆరోపణలు గుప్పుమన్నాయి. మారిషస్‌కు చెందిన కంపెనీలు పారదర్శకతకు పాతరేస్తూ.. భారీగా నిధులను అదానీ గ్రూప్ షేర్లలో పెట్టుబడులు పెట్టాయని ఓ నివేదికలో వెల్లడైంది. మారిషస్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌ను అదానీ కుటుంబ సభ్యులే నడిపించారని పేర్కొంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) అనే సంస్థ ఈ ఆరోపణలు చేసింది.
పన్ను శాతం తక్కువగా ఉన్న దేశాల్లోని పలు ఫైల్స్‌తో పాటు అదానీ గ్రూప్ ఈమెయిళ్లను పరిశీలించి ఈ నివేదిక రూపొందించినట్లు ఓసీసీఆర్పీ తెలిపింది. 'రహస్య ఇన్వెస్టర్లు' ఆఫ్‌షోర్ వ్యవస్థల ద్వారా అదానీ షేర్ల కొనుగోలు అమ్మకాలు చేసిన ఉదంతాలు కనీసం రెండు బయటపడ్డాయని వివరించింది. నాసర్ అలీ షాబాన్ అలీ, చాంగ్ చుంగ్-లింగ్ అనే ఇద్దరు వ్యక్తులు.. ఆఫ్‌షోర్ వ్యవస్థల ద్వారా ఎన్నో ఏళ్లుగా అదానీ షేర్ల కొనుగోళ్లు, అమ్మకాలు చేపట్టారని వెల్లడించింది. వీరిద్దరికీ అదానీ కుటుంబ వ్యాపారాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపింది. గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీకంపెనీలతో పాటు అదానీ గ్రూప్ కంపెనీలలో వీరికి షేర్లు ఉన్నాయని స్పష్టం చేసింది. కొన్ని కంపెనీలలో వీరు డైరెక్టర్లుగానూ పని చేశారని తెలిపింది.
చట్టాలను ఉల్లంఘించారు!
'అలీ, చాంగ్ ఇద్దరూ ఆదానీ ప్రమోటర్ల తరపున పనిచేస్తున్నారు. అంటే, చట్టం అనుమతించిన 75 శాతం కంటే.. ఆదానీ గ్రూప్‌లో అధికంగా అంతర్గత వ్యక్తులు పనిచేస్తున్నారు. ఇది కచ్చితంగా భారతీయ లిస్టింగ్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది' అని ఓసీసీఆర్పీ తన నివేదికలో పేర్కొంది. 'వాస్తవానికి చాంగ్, అలీలు పెట్టిన పెట్టుబడులు.. ఆదానీ కుటుంబం ఇచ్చిన డబ్బులతో చేసినవి అని చెప్పడానికి ఎలాంటి అధారాలు లేవు. కానీ కచ్చితంగా ఆదానీ కుటుంబంతో సమన్వయం చేసుకుని మాత్రమే ఈ వ్యవహారం నడిచింది అని చెప్పడానికి కచ్చితమైన ఆధారం ఉంది' అని ఓసీసీఆర్పీ తెలిపింది.
ఊహించనంత వేగంగా..
'మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 2013 సెప్టెంబర్ నాటికి అదానీ గ్రూప్ ఆస్తుల విలువ సుమారుగా రూ.8 బిలియన్ డాలర్లు ఉండేది. కానీ గతేడాది అదానీ గ్రూప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 260 బిలియన్ డాలర్లకు పెరగడం గమనార్హం' అని ఓసీసీఆర్పీ నివేదిక తెలిపింది.