తెలంగాణ

telangana

ETV Bharat / business

టెలికాం రంగంలోకి అదానీ.. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి దరఖాస్తు

Adani 5G Telecom Auction: భారత అపర కుబేరుడు గౌతమ్ అదానీ టెలికాం రంగంవైపు దృష్టిసారించారు. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకుంది. ఈ విషయాన్ని శనివారం అదానీ గ్రూప్‌ అధికారికంగా ప్రకటించింది. మెగా హెర్ట్జ్‌ సెక్ట్రమ్​ వేలం జులై 26న ప్రారంభమవుతుంది.

ADANI TELECOM
ADANI TELECOM

By

Published : Jul 9, 2022, 7:35 AM IST

Updated : Jul 9, 2022, 7:50 PM IST

Adani 5G auction: అపర కుబేరుడు గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌, టెలికాం సేవల్లోకి ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 26 నుంచి జరగనున్న స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్‌ దరఖాస్తు చేసుకున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించింది. 4జీ కంటే 10 రెట్ల వేగంతో డేటా బదిలీకి వీలున్న, వినూత్న సేవలందించేందుకు అనువైన 5జీ స్పెక్ట్రమ్‌ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది.

అయితే.. వినియోగదారులకు నేరుగా సేవలందించే ఉద్దేశంతో కాదని స్పష్టం చేసింది అదానీ గ్రూప్​. తమకు కేటాయించే 5జీ స్పెక్ట్రాన్ని పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో తదితర వాటిల్లో సైబర్‌ సెక్యూరిటీ కోసం వినియోగించనున్నామని పేర్కొంది.ఒకవేళ తమకు 5జీ స్పెక్ట్రమ్‌ కేటాయిస్తే ఎయిర్‌పోర్టులు, పోర్టులు, లాజిస్టిక్స్‌, పవర్‌ జనరేషన్‌, ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌, ఇతర తయారీ రంగ కార్యకలాపాల్లో సైబర్‌ సెక్యూరిటీ కోసం వినియోగించనున్నామని తెలిపారు అదానీ గ్రూప్​ అధికార ప్రతినిధి.ఇటీవల అదానీ ఫౌండేషన్‌ ప్రకటించిన దాతృత్వ కార్యకలాపాలకూ దీన్ని వినియోగిస్తామని పేర్కొన్నారు.

రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాతో పాటు అదానీ గ్రూప్‌ కూడా దరఖాస్తు చేసుకుంది. సుమారు రూ.4.3 లక్షల కోట్ల విలువ కలిగిన 72,097.85 మెగాహెర్ట్జ్‌ సెక్ట్రమ్​ వేలం జులై 26న ప్రారంభమవుతుంది. ఇటీవలే నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ఎన్‌ఎల్‌డీ), ఇంటర్నేషనల్‌ లాంగ్‌ డిస్టెన్స్‌ (ఐఎల్‌డీ) లైసెన్సులను అదానీ గ్రూప్‌ పొందడం గమనార్హం.

అంబానీతో నేరుగా పోరు: గుజరాత్‌కే చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీతో, అదే రాష్ట్రీయుడైన గౌతమ్‌ అదానీ ఇప్పటివరకు ఏ వ్యాపారంలోనూ నేరుగా తలపడిన సందర్భాలు లేవు. అంబానీ చమురు, పెట్రో రసాయనాల వ్యాపారం నుంచి టెలికాం-రిటైల్‌ రంగాల్లోకి విస్తరించారు. గనులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, విద్యుత్తు పంపిణీ వ్యాపార రంగాల్లో ప్రస్తుతం అదానీ ఉన్నారు. ఇటీవలే పెట్రో రసాయనాల వ్యాపారంలోకి ప్రవేశించేందుకు అనుబంధ సంస్థను అదానీ ఏర్పాటు చేయగా, ఇప్పుడు టెలికాంలోకి వస్తున్నారు. తద్వారా ఇద్దరు కుబేరుల మధ్య పోటీ తీవ్రం కానుంది. స్వచ్ఛ ఇంధన వ్యాపారంలోనూ ఇద్దరూ పోటీపోటీగా పెట్టుబడులకు సన్నాహాలు చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి:ట్విట్టర్​ డీల్ నుంచి ఎలాన్ మస్క్ ఔట్.. కోర్టుకు వెళ్తామన్న సంస్థ

త్వరపడండి.. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు తరుణమిదే!

Last Updated : Jul 9, 2022, 7:50 PM IST

ABOUT THE AUTHOR

...view details