Adani Hindenburg Case Verdict : అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై పెండింగ్‌లో ఉన్న మిగిలిన రెండు కేసులపై దర్యాప్తు మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది. దర్యాప్తును సెబీ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్)కి కేసు బదిలీ చేయాలన్న వాదనకు అర్థం లేదని తెలిపింది. అదానీ గ్రూప్‌పై మొత్తం 24 ఆరోపణలు రాగా అందులో 22 కేసుల్లో సెబీ దర్యాప్తు పూర్తైందని గుర్తు చేసిన ధర్మాసనం- సెబీ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌లో తలదూర్చే అధికారం సుప్రీంకోర్టుకు పరిమితంగానే ఉంటుందని వ్యాఖ్యానించింది. కోర్టు నియమించిన ప్యానెల్ సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం, సెబీ నడుచుకోవాలని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు చెప్పింది.
'ఆ నివేదికలపై ఆధారపడలేం!'
థర్డ్ పార్టీలు ఇచ్చే నివేదికలను నిర్ణయాత్మక ఆధారాలుగా పరిగణించలేమని తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టంగా తెలిపిందని పిటిషనర్ విశాల్ తివారి పేర్కొన్నారు. ఆరోపణలు రుజువు చేసేందుకు పక్కా ఆధారాలు అవసరమని పేర్కొన్నట్లు చెప్పారు.
'సత్యమేవ జయతే'
కాగా, ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ స్వాగతించారు. సత్యమేవ జయతే అని పేర్కొన్నారు. 'సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సత్యం గెలిచింది. నా పక్షాన నిలిచిన వారందరికీ ధన్యవాదాలు. భారతదేశ వృద్ధి ఇకపైనా కొనసాగుతుంది. దేశ వృద్ధికి మా గ్రూప్ తోడ్పాటు అందిస్తూనే ఉంటుంది' అని గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.