తెలంగాణ

telangana

ETV Bharat / business

మా ఖాతాలకు ఢోకా లేదు.. బ్యాలెన్స్​ షీట్లు బలంగా ఉన్నాయి: అదానీ గ్రూప్ - Adanai groups balance shetts

తమ కంపెనీల బ్యాలెన్స్‌షీట్లు బలంగా ఉన్నాయని అదానీ గ్రూప్‌ తెలిపింది. షేర్ల ధరలు పతనమవుతున్న నేపథ్యంలో.. మదుపర్లలో విశ్వాసాన్ని పెంచడం కోసం గ్రూప్‌ యత్నాలు చేస్తోందని స్పష్టం చేసింది.

adani
adani

By

Published : Feb 16, 2023, 7:05 AM IST

తమ కంపెనీల బ్యాలెన్స్‌షీట్లు బలంగా ఉన్నాయని అదానీ గ్రూప్‌ పునరుద్ఘాటించింది. వ్యాపార కార్యకలాపాలను ప్రణాళిక మేరకు కొనసాగించడంపై దృష్టి కేంద్రీకరించినట్లు పేర్కొంది. కంపెనీల షేర్ల ధరలు పతనమవుతున్న నేపథ్యంలో, మదుపర్లలో విశ్వాసాన్ని పెంచడం కోసం గ్రూప్‌ యత్నాలు చేస్తోంది. అంతర్గత నియంత్రణలు, నిబంధనలు, కార్పొరేట్‌ పాలన విషయంలో గ్రూప్‌ చాలా విశ్వాసంగా ఉందని గ్రూప్‌ సీఎఫ్‌ఓ జుగేషిందర్‌(రాబీ) సింగ్‌ ఫలితాల ప్రకటనల అనంతరం నిర్వహించిన 'ఎర్నింగ్‌ కాల్‌'లో పేర్కొన్నారు. అప్పులు, వడ్డీలు తీర్చే సామర్థ్యం, అందుకు సరిపడా నగదు నిల్వలు ఉన్నాయని ఒక ప్రకటనలో గ్రూప్‌ తెలిపింది. 'ఒక్కసారి మార్కెట్‌లో స్థిరత్వం ఏర్పడితే, మా మూలధన మార్కెట్‌ వ్యూహాన్ని సమీక్షిస్తాం. వ్యాపార ప్రణాళికల కొనసాగింపుతో పాటు వాటాదార్లకు మంచి ప్రతిఫలాలను ఇస్తామన్న విశ్వాసం ఉంద'ని సింగ్‌ పేర్కొన్నారు.

నగదు ప్రవాహానికి ఇబ్బంది లేదు: 2022 సెప్టెంబరు నాటికి అదానీ గ్రూప్‌ స్థూల రుణాలు రూ.2.26 లక్షల కోట్లుగా ఉండగా.. నగదు నిల్వలు రూ.31,646 కోట్లే ఉన్నాయి. 'మా వ్యాపారాలను దీర్ఘకాల యాన్యుటీ కాంట్రాక్టులపై నిర్వహిస్తున్నాం. కాబట్టి ఎటువంటి మార్కెట్‌ నష్టభయమూ లేకుండా స్థిరంగా నగదు ప్రవాహం ఉంటుంద'ని కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది.

ఎఫ్‌పీఓ ఉపసంహరణ ప్రభావం ఉండదు: మార్కెట్‌ ప్రస్తుత స్థితి తాత్కాలికమేనని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ ఫలితాల సందర్భంగా గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ పేర్కొన్న సంగతి విదితమే. సీఎఫ్‌ఓ మాట్లాడుతూ 'అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు 25 ఏళ్ల అనుభవం ఉంది. ఒక క్రమపద్ధతిలో మూలధనాన్ని వినియోగించి, వాటాదార్లకు విలువ అందిస్తూ వచ్చింది. ఈ సమయంలోనే భారత వృద్ధి, ఆర్థిక సౌభ్రాతృత్వానికి అవసరమైన రంగాల్లో అదానీ పోర్ట్స్‌, అదానీ ట్రాన్స్‌మిషన్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, అదానీ టోటల్‌ గ్యాస్‌, అదానీ విల్మర్‌ వంటి కంపెనీలను ఏర్పాటు చేశామ'ని తెలిపారు. ఎఫ్‌పీఓ ఉపసంహరణపై మాట్లాడుతూ 'అనిశ్చిత మార్కెట్‌ వల్లే ఆ నిర్ణయం తీసుకుంది. మా ప్రస్తుత, భవిష్యత్‌ ప్రణాళికలకు ఇది ఏ విధమైన ప్రభావం చూపబోద'ని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details