Adani spectrum auction: టెలికాం రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశిస్తోందంటూ వచ్చిన వార్తలపై ఆ గ్రూప్ స్పందించింది. 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడం నిజమేనని ధ్రువీకరించింది. కానీ, వినియోగదారులకు నేరుగా సేవలందించే ఉద్దేశంతో కాదని స్పష్టం చేసింది. తమకు కేటాయించే 5జీ స్పెక్ట్రాన్ని పోర్టులు, ఎయిర్‌పోర్టుల్లో తదితర వాటిల్లో సైబర్ సెక్యూరిటీ కోసం వినియోగించనున్నామని పేర్కొంది.
'అవును.. 5జీ స్పెక్ట్రమ్ రేసులో ఉన్నాం.. కానీ' - 5జీ స్పెక్ట్రమ్ అదానీ న్యూస్
Adani spectrum auction: 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొంటున్నట్లు వచ్చిన వార్తలను అదానీ గ్రూప్ ధ్రువీకరించింది. అయితే, వినియోగదారులకు సేవలు అందించే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది.
Adani telecom company: ఈ నెల 26 నుంచి జరగనున్న 5జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనేందుకు అదానీ గ్రూప్ దరఖాస్తు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ కూడా దరఖాస్తు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో ముకేశ్ అంబానీకి పోటీగా టెలికాం విభాగంలోకి అదానీ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
"5జీ స్పెక్ట్రమ్ వేలం దరఖాస్తు గురించి ఆరా తీస్తూ మాకు అనేక సందేశాలు వచ్చాయి. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి దేశం సన్నద్ధమవుతున్న వేళ ఓపెన్ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు మేం కూడా దరఖాస్తు చేసుకున్నాం. అయితే, కన్జ్యూమర్ మొబిలిటీ రంగంలోకి ప్రవేశించలన్నది మా ఉద్దేశం కాదు" అదానీ గ్రూప్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఒకవేళ తమకు 5జీ స్పెక్ట్రమ్ కేటాయిస్తే ఎయిర్‌పోర్టులు, పోర్టులు, లాజిస్టిక్స్, పవర్ జనరేషన్, ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్, ఇతర తయారీ రంగ కార్యకలాపాల్లో సైబర్ సెక్యూరిటీ కోసం వినియోగించనున్నామని తెలిపారు. ఇటీవల అదానీ ఫౌండేషన్ ప్రకటించిన దాతృత్వ కార్యకలాపాలకూ దీన్ని వినియోగిస్తామని పేర్కొన్నారు.