హిండెన్‌బర్గ్ నివేదికతో అతలాకుతలమవుతున్న అదానీ గ్రూప్.. కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ షేర్లను తాకట్టు పెట్టి తెచ్చుకున్న రుణాలను ముందుగానే చెల్లించేందుకు సిద్ధమైంది. వాస్తవానికి 2024 సెప్టెంబర్ వరకు గడువు ఉన్నా ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి దృష్ట్యా సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. సుమారు 1,114 మిలియన్ డాలర్లను చెల్లిస్తామని సంస్థ వెల్లడించింది. తాకట్టు పెట్టిన వాటిలో అదానీ పోర్ట్స్‌కు సంబంధించిన 168.27 మిలియన్ షేర్లు, అదానీ గ్రీన్‌లో 27.56 మిలియన్ షేర్లు, అదానీ ట్రాన్స్‌మిషన్‌లో 11.77 షేర్లు ఉన్నాయని సంస్థ ప్రకటనలో పేర్కొంది.
అదానీ గ్రూప్ మార్కెట్ విలువ సగానికి పతనం
మరోవైపు హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ భారీగా నష్టపోయింది. షేర్ మార్కెట్లో సంస్థ విలువ సగానికి పైగా పతనమైంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీని గత ఏడు సెషన్లలో పరిశీలిస్తే.. అదానీ ఎంటర్ప్రైజైస్ షేరు విలువ సుమారు 54 శాతం నష్టపోయింది.