Gautam Adani donation: ఆసియాలోనే సంపన్నుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సమాజ సేవకు ముందుకొచ్చారు. విద్య, వైద్యం, నైపుణ్య అభివృద్ధి కోసం రూ.60వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రకటించారు. అదానీ 60వ పుట్టిన రోజును పురస్కరించుకుని అదానీ, ఆయన కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదానీ ఫౌండేషన్ ద్వారా ఈ మొత్తాన్ని దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేయనున్నారు.
శుక్రవారంతో అదానీకి 60వ ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అదానీ కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. గౌతమ్ అదానీ తండ్రి శాంతిలాల్ అదానీ శత జయంతి కూడా ఇదే ఏడాది కావడంతో పెద్ద ఎత్తున దాతృత్వ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. విరాళ మొత్తాన్ని అదానీ ఫౌండేషన్ ద్వారా దేశవ్యాప్తంగా విద్య, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, నైపుణ్యాభివృద్ధి కోసం వినియోగించనున్నారు. ఇందుకోసం మూడు కమిటీలు నియమిస్తామని గౌతమ్ అదానీ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ మొత్తాన్ని ఏయే రూపాల్లో ఖర్చు చేయాలనేది ఆయా కమిటీలు నిర్ణయిస్తాయని తెలిపారు. అదానీ కుటుంబ సభ్యులు కమిటీల్లో సహాయక సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు.