How to get income tax refund faster : ఆదాయ పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయడానికి జులై 31 చివరి తేదీ. ఇది వరకే ఐటీఆర్ సమర్పించిన వారికి ఆదాయ పన్ను విభాగం రిఫండ్‌ను కూడా అందించింది. కానీ కొంత మంది తాము చెల్లించిన పన్ను మొత్తం రిఫండ్ రూపంలో అందుకునేందుకు మోసపూరిత మినహాయింపులను క్లెయిం చేస్తున్నారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. ఐటీ విభాగం వారు ఇలాంటి మోసాలను అడ్డుకునేందుకు సరికొత్త సాంకేతికతను వినియోగిస్తున్నారు. అందువల్ల తస్మాత్త్ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సార్లు మనం చెల్లించాల్సిన పన్నుకు మించి మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్) పడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో వాస్తవంగానే టాక్స్ రిఫండ్ అందుతుంది.
ఆదాయ పన్ను రిఫండ్ రావాలంటే ఏం చేయాలి?
Income tax refund claim procedure : వ్యక్తులు తాము ఆర్జించిన ఆదాయం, ఇతర ఆర్థిక అంశాల ఆధారంగా, సరైన ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకొని, రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. మీరు కచ్చితంగా రిఫండ్ రావాలని ఆశిస్తూ ఉంటే.. ముందుగా ఫారం 26ఏఎస్, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లను జాగ్రత్తగా పరిశీలించండి. ఇందులో మీ ఆదాయ వివరాలతోపాటు, చెల్లించిన టీడీఎస్, టీసీఎస్ లాంటి వివరాలు ఉంటాయి. వాస్తవానికి కొన్ని సార్లు మీ దగ్గర వసూలు చేసిన పన్ను వివరాలు.. ఆదాయపన్ను శాఖకు జమ కాకపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఫారం 26ఏఎస్‌లో కూడా అది కనిపించదు.
పన్ను వర్తించే ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే, ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 87ఏ కింద రూ.12,500 వరకు పన్ను రిబేటు లభిస్తుంది. చాలా మందికి సంబంధించి ఫారం 26ఏఎస్‌లో ఇది కనిపించే అవకాశం ఉంది.