5g Mobile: 5జీ మొబైల్ కొనుక్కునే యోచనలో ఉన్నవారికి ఇది తీపి కబురనే చెప్పాలి! వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.10 వేలకే 5జీ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దీనిపై ఇప్పటికే మొబైల్ సంస్థలు, అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ కంపెనీలు కలిసి పనిచేస్తున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. వచ్చే మార్చి నాటికి దేశంలో కీలక ప్రాంతాల్లో 5జీ సేవల్ని ప్రారంభించే యోచనలో టెలికాం కంపెనీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అందుబాటు ధరలో 5జీ ఫోన్లను తీసుకురావడం కీలకంగా మారనుంది. ఇప్పటికే విస్తృతంగా వినియోగంలో ఉన్న 4జీ, 3జీ మొబైళ్ల స్థానంలో 5జీ ఫోన్లను తీసుకురావాలంటే ధరలు తగ్గాల్సిందే.
భారత్ వంటి దేశాల్లో కొత్త చిప్‌సెట్‌ను ప్రవేశపెడతామని అంతర్జాతీయ కంపెనీ క్వాల్‌కామ్ తెలిపింది. ప్రస్తుతం 5జీ ప్రాసెసర్‌తో వస్తోన్న స్నాప్‌డ్రాగన్ 480 చిప్‌సెట్‌తో పోలిస్తే దాని ధర తక్కువగా ఉంటుందని పేర్కొంది. తైవాన్‌కు చెందిన మీడియాటెక్, చైనా కంపెనీ యూనిసాక్ సైతం అందుబాటు ధరలో చిప్‌సెట్‌లను అందించేందుకు ముందుకు వచ్చాయని మొబైల్ తయారీ సంస్థలు వెల్లడించాయి.