SBI research: దేశంలో అన్నదాతల ఆర్థిక పరిస్థితి ఇటీవలి కొన్నేళ్లలో మెరుగుపడిందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2017-18తో పోలిస్తే 2021-22 లో రైతుల ఆదాయం సగటున 1.3 - 1.7 రెట్ల మేర పెరిగినట్లు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో మన వ్యవసాయ ఎగుమతులు రూ.4 లక్షల కోట్ల మేర జరిగాయని వెల్లడించింది. ప్రత్యేకించి కొన్ని రాష్ట్రాల్లో నిర్దిష్ట పంటలు సాగు చేసే రైతులకు రాబడి, రెట్టింపు కంటే ఎక్కువయిందని నివేదించింది. మహారాష్ట్రలో సోయాబీన్, కర్ణాటకలో పత్తి సాగు చేసేవారిని ఇందుకు ఉదాహరణగా పేర్కొంది.
ఈ నివేదికలోని ముఖ్యాంశాలివీ..
* 2017-18లో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 14.2%గా ఉన్న వ్యవసాయ రంగ వాటా.. 2021-22లో 18.8 శాతానికి పెరిగింది. కొవిడ్ రెండోదశ ఉద్ధృతి కారణంగా పారిశ్రామిక, సేవారంగాల వాటా జీడీపీలో తగ్గడమూ, సాగు రంగం వాటా బాగా పెరిగినట్లు కనిపించడానికి ఓ కారణమే.
* మెజారిటీ రాష్ట్రాల్లో రైతుల వ్యవసాయేతర/అనుబంధ ఆదాయంలో 1.4 నుంచి 1.8 రెట్ల వరకు పెరుగుదల నమోదైంది.
* 2020-21లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.6% కుంచించుకుపోగా.. వ్యవసాయ రంగంలో వృద్ధి కొనసాగింది. 2021-22లోనూ రైతుల ఆదాయాల్లో వృద్ధి కొనసాగింది. గత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ ఎగుమతుల విలువ 5 వేల కోట్ల డాలర్ల (సుమారు రూ.4 లక్షల కోట్ల)కు చేరింది.
* విధానాల పరంగా ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో పాటు ప్రజల ఆహారపు అలవాట్లలో మార్పులు.. ముఖ్యంగా పోషకాహారంపై శ్రద్ధ పెరగడం, పంట మార్పిడిపై అన్నదాతలు ఆసక్తి చూపడం వంటి అంశాలు సాగురంగ అభ్యున్నతికి దోహదపడ్డాయి.