330 RS Deducted From SBI Account : మీ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.330 కట్ అయ్యాయా? ఎందుకు అంత మొత్తంలో ఖాతా నుంచి డెబిట్ అయ్యిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇకపై ఆ డబ్బులు మీ అకౌంట్ నుంచి కట్ కాకుండా ఉండాలా? అందుకు ఏం చేయాలో ఓ సారి తెలుసుకుందాం.
దేశంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో ప్రజలు అకౌంట్ ఓపెన్ చేస్తారు. అయితే ఏటీఎం, ఎస్ఎంఎస్ ఛార్జీలంటూ ఏడాదిలో చాలా సార్లు కస్టమర్ల అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఈ క్రమంలో కస్టమర్లు ఎందుకు ఇంతలా తమ అకౌంట్ నుంచి బ్యాంక్లు డబ్బులను కట్ చేస్తున్నాయని వాపోతుంటారు. కానీ ప్రభుత్వ సూచన, అభీష్టం మేరకు కొన్ని పాలసీలను కస్టమర్లే తీసుకుంటారు. అది మీరు తీసుకున్న ఓ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించినదే. ఆ పాలసీ పేరే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన( పీఎంజేజేబీవై). ఏడాదికి రూ.330 ఆ పాలసీ ప్రీమియం కోసం ఏటా కట్ అవుతాయి.
మీ ఖాతా నుంచి రూ.330 ఎందుకు కట్ అవుతుందంటే?
మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ.330 కట్ అయినట్లయితే.. అవి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేబీవై) ప్రీమియంకు మీరు చెల్లించినట్లు. అది మీ అంగీకారం ప్రకారమే బ్యాంక్ కట్ చేస్తుంది.
అసలేంటీ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన?
PMJJBY Policy Details In Telugu : ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పాలసీకిప్రీమియం రూ.330. గుర్తింపు పొందిన బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్న 18-50 ఏళ్ల లోపు వ్యక్తులు దీనికి అర్హులు. ఆదాయంతో నిమిత్తం లేదు. ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలున్నా.. పాలసీ ఒకటే ఇస్తారు. ఇది ఏటా జూన్ 1న ప్రారంభం అవుతుంది. ఈ పథకంలో కొత్తగా చేరితే.. నమోదు చేసిన 45 రోజుల తర్వాత మాత్రమే బీమా వర్తిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న పాలసీదారుదారులు ఏ కారణంతో మరణించినా.. రూ.2లక్షల బీమా పరిహారం అందుతుంది.