2023 Salary increase projections India : 2023లో భారతీయ కార్పొరేట్ రంగంలోని ఉద్యోగుల వేతనాలు 10.4శాతం పెరగవచ్చని ఓ సర్వే ద్వారా తెలిసింది. వృత్తిపరమైన సేవలు అందించే ప్రముఖ సంస్థ- Aon Plc ఈ విషయం వెల్లడించింది. అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలు, దేశీయంగా ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ఉన్నా.. రెండంకెల శాతంతో జీతాలు పెంచాలని కార్పొరేట్ సంస్థలు భావిస్తున్నాయని తెలిపింది. తమ వ్యాపారం బాగుంటుందన్న అంచనాలే ఇందుకు కారణమని వివరించింది.
2023లోనూ డబుల్ ధమాకా.. సాలరీలు ఎంత పెరుగుతాయంటే.. - 2023 శాలరీ హైక్ అంచనాలు
2023 Salary increase projections India : అంతర్జాతీయంగా ఆర్థిక మాంద్యం భయాలున్నా.. 2023లో భారతీయ కార్పొరేట్ రంగంలో వేతనాలు రెండంకెల శాతం పెరగొచ్చని ఓ సర్వే ద్వారా తెలిసింది. జీతాలు సగటున 10.4శాతం పెరిగే అవకాశం ఉందని వెల్లడైంది.
దేశంలోని 40 వేర్వేరు రంగాలకు చెందిన 1300 సంస్థల డేటాను విశ్లేషించి ఈ నివేదిక రూపొందించింది Aon Plc. ఆ నివేదిక ప్రకారం.. 2022 ప్రథమార్ధంలో అట్రిషన్(ఉద్యోగులు సంస్థను వీడడం) రేట్ 20.3శాతంగా ఉంది. 2021లో ఉన్న అట్రిషన్ రేట్(21శాతం)తో పోల్చితే ఇది కాస్త తక్కువే అయినా.. జీతాలు సాధ్యమైనంత మేర పెంచాల్సిన పరిస్థితికి కారణమవుతోంది.
2022లో వేతనాలు సగటున 10.6శాతం మేర పెరిగాయి. ఫిబ్రవరిలో అధ్యయనం చేయగా.. 2023లో 9.9శాతం హైక్ ఉండొచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. ఇప్పుడు ఆ లెక్కల్లో కాస్త మార్పు రాగా.. వేతనాలు 10.4శాతం పెరిగే అవకాశముందని సర్వే ద్వారా వెల్లడైంది.
Expected salary increases for 2023 : జీతాల పెంపు అధికంగా ఉండే ఐదింట నాలుగు రంగాలు.. టెక్నాలజీకి సంబంధించినవే అని సర్వేలో తేలింది. అయితే.. అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతల ప్రభావమూ ఆయా రంగాలపై ఎక్కువగా ఉంటుందని తెలిసింది. "అత్యధికంగా ఈ-కామర్స్ రంగంలో 12.8శాతం మేర వేతనాలు పెరగవచ్చు. స్టార్టప్‌ల విషయంలో అది 12.7శాతంగా ఉండొచ్చు. ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలోని ఉద్యోగుల వేతనాలు 11.3శాతం పెరగవచ్చు. ఆర్థిక సంస్థల 10.7శాతం మేర జీతాలు పెంచవచ్చు" అని వివరించారు Aon Plc ప్రతినిధి రూపాంక్ చౌదరి.