2000 rupees note withdrawn : రూ.2000 నోట్లను ఉపసంహరించుకోవాలని రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. సర్కులేషన్లో ఉన్నవాటన్నింటినీ వెనక్కు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నోట్లు మార్చుకునేందుకు మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. అయితే.. ఒక్కోసారి రూ.20వేలు విలువైన పెద్ద నోట్లను మాత్రమే బ్యాంకుల్లో వేరే నోట్లతో మార్చుకోవచ్చని తెలిపింది. ఇందుకు అన్ని బ్యాంకులు అవకాశం కల్పించాలని సూచించింది. రిజర్వు బ్యాంకుకు దేశంలోని వేర్వోరు చోట్ల ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ రూ.2000 నోట్లు మార్చుకోవచ్చని తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2000 నోట్లు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. ఇకపై ఎవరికీ రూ.2000 నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు సూచించింది ఆర్బీఐ.
భారతీయ రిజర్వు బ్యాంకు 2016 నవంబర్లో రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసి.. రూ.2000 నోట్లను చలామణీలోకి తీసుకొచ్చింది. ఇతర డినామినేషన్ నోట్లు సరిపడా చలామణీలోకి వచ్చాయని నిర్ధరించుకున్న తర్వాత.. 2018-19లో పెద్ద నోట్ల ముద్రణను నిలిపివేసింది. ప్రస్తుతం ఉన్న 2000 రూపాయల నోట్లలో దాదాపు 89శాతం 2017 మార్చికన్నా ముందు జారీ చేసినవే. వాటి జీవితకాలం (4.5 ఏళ్లు) చివరకు చేరుకుందని రిజర్వు బ్యాంకు శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.