తెలంగాణ

telangana

ETV Bharat / business

రూ.2వేల నోట్లు ఇప్పుడు చెల్లుతాయా? మార్చుకోవాలంటే ఛార్జీలు చెల్లించాలా? - 2000 note withdrawal notice

2000 note withdraw by RBI : రూ.2వేల నోట్ల ఉపసంహరణపై ఆర్​బీఐ ప్రకటన నేపథ్యంలో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ నోట్లు చెల్లుతాయా? రూ.20వేల కంటే ఎక్కువ మార్చుకోవాలంటే ఏం చేయాలి? వంటి ప్రశ్నలకు ఆర్​బీఐ సమాధానాలు చెప్పింది.

2000 note withdraw by rbi
2000 note withdraw by rbi

By

Published : May 20, 2023, 7:46 AM IST

2000 note withdraw by RBI : రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు చేసిన ప్రకటనతో ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కస్టమర్లకు ఈ నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆర్​బీఐ సూచించిన నేపథ్యంలో.. ఈ నోట్ల చలామణీపై ప్రశ్నలు వస్తున్నాయి. నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు సమయం ఇస్తున్నట్లు ఆర్​బీఐ తెలిపింది. ఇదేసమయంలో ప్రజల్లో ఉన్న పలు ప్రశ్నలు/ సందేహాలకు సమాధానాలు సైతం ఇచ్చింది.

రెండు వేల నోట్లను రిజర్వు బ్యాంకు ఎందుకు ఉపసంహరించుకుంటోంది?
2000 note withdrawal reason : మార్కెట్లో అవసరమైన కరెన్సీ అందుబాటులోకి వచ్చింది. ఈ కారణం వల్లే రూ.2వేల నోటును ముద్రించడం నిలిపివేశాం. 2018-19లోనే ఈ నోట్ల ముద్రణ ఆగిపోయింది. ప్రస్తుతం చలామణీలో ఉన్న రూ.2వేల నోట్లన్నీ 2017 మార్చికి ముందు ముద్రించినవే. వాటి జీవితకాలం నాలుగు నుంచి ఐదేళ్లు ఉంటుంది.

రూ.2వేల నోటు ఇప్పుడు చెల్లుబాటు అవుతుందా?
అవును. రూ.2వేల నోటు చెల్లుబాటు అవుతుంది. గడువులోపు వాటిని బ్యాంకులో మార్చుకుంటే సరిపోతుంది.
సాధారణ లావాదేవీలకు రూ.2వేల నోట్లను వినియోగించవచ్చా?
సాధారణ లావాదేవీలకు రూ.2వేల నోట్లను ప్రజలు వినియోగించవచ్చు. వాటిని స్వీకరించవచ్చు కూడా. అయితే, గడువు తేదీ అయిన 2023 సెప్టెంబర్ 30 లోగా ఆ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయాలి. లేదా ఆ నోట్లను బ్యాంకులో ఇచ్చి ఇతర నోట్లను తీసుకోవాలి.

రూ.2వేల నోట్లను ఎక్కడెక్కడ మార్చుకోవచ్చు?
ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2వేల నోట్లను ఏ బ్యాంకు శాఖలలోనైనా మార్చుకునే వెసులుబాటు ఉంది. లేదా దేశవ్యాప్తంగా ఆర్​బీఐకి ఉన్న 19 ప్రాంతీయ కార్యాలయాల్లోనూ నోట్లు మార్చుకోవచ్చు.

బ్యాంకులో రూ.2వేల నోట్ల 'డిపాజిట్​'పై పరిమితి ఉందా?
బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవడంపై ఎలాంటి ఆంక్షలు విధించలేదు. కేవైసీ రూల్స్​ను అనుసరించి డిపాజిట్ చేసుకోవచ్చు.

రూ.2వేల నోట్లను 'మార్చుకునేందుకు' పరిమితి ఉందా?
రూ.2వేల నోట్లు మార్చుకోవడంపై పరిమితి ఉంది. ప్రజలు ఒకసారి రూ.20వేలు మాత్రమే మార్చుకునే వీలు ఉంటుంది.
ఈ రూ.2వేల నోట్లను ఎప్పటి నుంచి మార్చుకోవచ్చు?
2023 మే 23 తేదీ నుంచి నోట్లను మార్చుకునే వీలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకునేందుకు బ్యాంకుల కోసం ఈ గడువు ఇచ్చారు.

బ్యాంకు ఖాతా ఉన్న బ్రాంచీలోనే రూ.2వేల నోట్లు మార్చుకోవాలా?
అలా ఏం లేదు. ఏ బ్యాంకులోనైనా రూ.2వేల నోట్లను మార్చుకునే వీలు ఉంది. కానీ, ఒక బ్రాంచీలో ఒకేసారి రూ.20వేలు మాత్రమే మార్చుకునే వీలు ఉంది.

రూ.20వేల కంటే ఎక్కువ అవసరమైతే ఏం చేయాలి?
నోట్లు మార్చుకొని ఇతర నోట్లు తీసుకోవడంపైనే ఆంక్షలు ఉన్నాయి. కానీ, డిపాజిట్ విషయంలో అలాంటి ఆంక్షలు లేవు. రూ.2వేల నోట్లు ఎన్ని ఉన్నా.. వాటిని ఒకేసారి తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. అవసరం మేరకు ఆ తర్వాత వాటిని విత్​డ్రా చేసుకోవచ్చు.

నోట్ల మార్పిడికి ఫీజు చెల్లించాలా?
లేదు. నోట్లు మార్చుకోవడానికి ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితం.
వెంటనే రూ.2వేల నోటు డిపాజిట్ చేయకుంటే ఏం జరుగుతుంది?
నోట్ల మార్పిడి ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా 4 నెలల సమయం ఇచ్చాం. ఈ గడువులోగా వాటిని మార్చుకోవాలని/ డిపాజిట్ చేయాలని సూచిస్తున్నాం.

రూ.2 వేల నోటును తీసుకోవడానికి బ్యాంకులు నిరాకరిస్తే?
బ్యాంకులు నోట్లను తీసుకోకపోవడం సేవల లోపంగా పరిగణిస్తారు. ఇలాంటి ఘటనలు జరిగితే తొలుత బ్యాంకు అధికారులను సంప్రదించి.. ఫిర్యాదు చేయాలి. 30 రోజుల్లోగా స్పందించకపోయినా.. లేదా బ్యాంకు అధికారి ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోయినా.. రిజర్వు బ్యాంకు అంబుడ్స్​మెన్ స్కీమ్ కింద ఆర్​బీఐకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details