2000 Note Exchange Rules : రూ. 2వేల నోట్ల మార్పిడికి సంబంధించి ప్రజల్లో అనేక అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో.. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది. రూ.2వేల నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి చేసుకున్నప్పుడు ఎలాంటి గుర్తింపు పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది. ఎటువంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదని కూడా చెప్పింది. ఒకసారి గరిష్ఠంగా రూ.20 వేల విలువ చేసే రూ. 2వేల నోట్లు డిపాజిట్ చేయటం లేదా మార్పిడి చేసుకోవచ్చని వెల్లడించింది.
SBI 2000 Notes : రూ. 2వేల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్ చేయటానికి ఓ ఫామ్‌తోపాటు ఆధార్ వంటి గుర్తింపు పత్రాలను సమర్పించాలంటూ సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఎస్బీఐ.. ఆదివారం స్పష్టత ఇచ్చింది. దేశంలోని అన్ని శాఖలకు పూర్తి మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరింది.
రూ.2వేల నోట్ల మార్పిడిపై ఎస్బీఐ మార్గదర్శకాలు 2000Nnotes Withdrawal India : రూ. 2వేల నోట్ల ఉపసంహరించుకుంటున్నట్లు ఈనెల 19వ తేదీన ఆర్‌బీఐ సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ నోట్లను పూర్తిగా రద్దు చేయడం లేదని.. ఇప్పటికీ లావాదేవీలకు ఈ నోట్లను వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. రూ.2వేల నోట్లు ఉన్నవారు సెప్టెంబరు 30లోగా బ్యాంకులు, ఆర్‌బీఐ కార్యాలయాల్లో మార్చుకోవచ్చని తెలిపింది. ఇకపై ఎవరికీ రూ.2000 నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు సూచించింది. 'క్లీన్ నోట్ పాలసీ' కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
2016లో జారీ
"ఆర్‌బీఐ చట్టం 1934 సెక్షన్ 24(1) కింద 2016 నవంబరులో రూ.2,000 నోటును ప్రవేశపెట్టాం. అప్పటివరకు చలామణీలో ఉన్న రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ఎదురైన ఆర్థిక అవసరాలను వేగంగా అందిపుచ్చుకోవడానికి రూ.2,000 నోట్లు ప్రవేశపెట్టాం. ప్రస్తుతం ఇతర నోట్లు తగినంత సంఖ్యలో అందుబాటులోకి రావడం వల్ల రూ.2,000 నోట్ల జారీ లక్ష్యం పూర్తయింది. అందుకే 2018-19లోనే వీటి ముద్రణ నిలిపేశాం. ఇప్పటి వరకు ఉన్న రూ.2,000 నోట్లలో 89 శాతం వరకు, 2017 మార్చి ముందు జారీ చేసినవే. అంటే ఆ నోట్లు జారీ అయి 4-5 ఏళ్లు అవుతోంది" అంటూ ఆర్‌బీఐ చెప్పుకొచ్చింది.
'ప్రస్తుతమున్నది రూ.3.62 లక్షల కోట్లే'
2018 మార్చి 31 నాటికి గరిష్ఠంగా రూ.6.73 లక్షల కోట్ల మేర రూ.2.000 నోట్లు చలామణీలో ఉన్నాయని ఆర్‌బీఐ తెలిపింది. "చలామణీలో ఉన్న నగదులో ఇది 37.3 శాతం. 2023 మార్చి 31 నాటికి రూ.3.62 లక్షల కోట్లకు (చలామణీలో ఉన్న నగదులో 10.8%) తగ్గిపోయాయి. అంటే ఈ నోట్లను సాధారణ లావాదేవీలకు ఉపయోగించడం లేదు. ప్రస్తుతం ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఇతర నోట్ల నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయి" అని ఆర్‌బీఐ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. గతంలోనూ ఆర్‌బీఐ.. 2005 నుంచి అమల్లో ఉన్న పాత నోట్లను 2014 ఏప్రిల్‌లో ఉపసంహరించింది.
2000 Notes RBI Guidelines : అయితే రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు చేసిన ప్రకటనతో ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కస్టమర్లకు ఈ నోట్లు ఇవ్వొద్దని బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించిన నేపథ్యంలో.. ఈ నోట్ల చలామణీపై ప్రశ్నలు వస్తున్నాయి. ఇదే సమయంలో ప్రజల్లో ఉన్న పలు ప్రశ్నలు/ సందేహాలకు సమాధానాలు సైతం ఆర్‌బీఐ ఇచ్చింది. అందుకు సంబంధించిన పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.